పెద్దఅంబర్‌పేట, జనవరి 20: ఫిర్యాదు తీసుకోండి.. ఎఫ్ఐఆర్ చేయండి.. కేసు దర్యాప్తు చేయండి.. నిందితులను పట్టుకోండి.. విచారణ జరపండి.. ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను కాపాడేందుకు పరుగులు తీయాలి.. ప్రజాప్రతినిధులు వస్తే బందోబస్తుకు వెళ్లాలి.. ఇవీ నిత్యం పోలీసుల నోట వినిపించే మాటలు.. కానీ, వీటన్నింటికి భిన్నంగా.. ఫోర్ కొట్టండి.. క్యాచ్ మిస్ కావొద్దు.. బౌలింగ్ బాగా చేయాలి.. మనమే గెలవాలి.. అనే మాటలు వినిపించాయి.
చప్పట్లు కొడుతూ మైదానంలో పోటీపడ్డారు పోలీసులు. రాచకొండ పోలీస్ ఆరో వార్షిక స్పోర్ట్స్, గేమ్స్ మీట్ కార్యక్రమాన్ని సోమవారం మున్సిపాలిటీ పరిధి కుంట్లూరులోని సీఎన్ఆర్ గ్రౌండ్లో నిర్వహించారు. రాచకొండ కమిషనర్ జీ సుధీర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. సరదాగా బౌలింగ్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిత్యం పరుగులు తీసే పోలీసులు మైదానంలో పోటీ పడ్డారు. బ్యాటు, బాల్ చేతపట్టుకుని ఉత్సాహంగా ఆటలు ఆడారు.