రంగారెడ్డి, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునుగనూరు గ్రామంలోని ప్రభుత్వ భూమి వ్యవహారం మరోమారు తెరమీదకు వచ్చింది. మునుగనూరు గ్రామంలోని సర్వేనెంబర్ 90లో 6.20ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో 2ఎకరాలను క్రీడాప్రాంగణానికి కేటాయించారు. మిగిలిన 4.20 ఎకరాల్లో కొంతమంది 54 ఇండ్లు నిర్మించారు. ఇదే భూమి పక్కన రామశర్మ అనే పూజారి కాశీ విశ్వనాథ ఆలయం నిర్మించడానికి 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు.
ఈ స్థలంలో నిర్మించిన ఇండ్లతో పాటు తన స్థలాన్ని కూడా కొందరు ఆక్రమించారని పూజారి హైకోర్టును ఆశ్రయించాడు. సుమారు రూ.50కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని.. దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని పూజారి హైకోర్టును కోరాడు. దీంతో హైకోర్టు పూజారి వాదనలు విని రెవెన్యూ, పురపాలక ముఖ్య కార్యదర్శులకు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సోమవారం నోటీసులు జారీచేసింది. దీంతో మునుగనూరు భూముల వ్యవహారం మరోమారు తెరమీదకు వచ్చింది.
ఈ భూమిలో అక్రమంగా ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదులందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో 54 ఇండ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఇండ్లలో స్థిర నివాసం కూడా ఉంటున్నారు. దీనిపై హైకోర్టు స్పందించటంతో మారుమారు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.