రంగారెడ్డి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు పత్తి రైతును నిండా ముంచుతున్నాయి. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో అన్నదాత తీవ్రంగా నష్టపోగా.. ప్రభుత్వాల ఆంక్షలు మరింత శాపంగా మారాయి. జిల్లాలోని రైతులకు ప్రధాన ఆదాయాన్ని ఇచ్చే పత్తిపంట దిగుబడి రాక ..గిట్టుబాటు లేక రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పులను మూటకట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పి.. ఇప్పటికీ దాని ఊసే ఎత్తకపోవడంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందని దుస్థితి నెలకొన్నది. జిల్లాలో ఈ వానకాలంలో 1,30,000 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేయగా.. సుమారు లక్షకు పైగా క్వింటాళ్ల వరకు దిగుమతి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కాగా, పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వానలతో పంటకు అపారనష్టం కలిగింది. మరోవైపు సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులు సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకే మధ్యదళారులకు విక్రయించి నష్టపోతున్నారు. సీసీఐ క్వింటాల్ పత్తికి రూ.8,100 మద్దతు ధర ప్రకటించినా తేమశాతం నిబంధన పేరుతో అన్నదాత అవస్థలు పడుతున్నాడు.
సీసీఐ ఆధ్వర్యంలో కపాస్ కిసాన్ యాప్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం లో రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే కొనుగోలు కేంద్రాల్లో పత్తిని కొంటారు. ఈ యాప్‌లో రైతుపేరు, ఫోన్‌నంబర్, ఆధార్‌కార్డు, భూమి యజమాని పేరు వంటి పలు నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నిబంధనల ప్రకారం రైతులు తాము పండించిన పత్తిని అమ్మేందుకు తప్పనిసరిగా స్లాట్ బుక్చేసుకోవల్సి పరిస్థితి నెలకొన్నది. కాగా, గ్రామీణ ప్రాంతాలో నిరక్షరాస్యులైన రైతులు ఎక్కువగా ఉండడం, వారికి సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకపోవడంతో ఈ యాప్‌ను ఉపయోగించుకోలేకపోతున్నారు. కొందరు రైతులు ఈ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుంటున్నా తేమశాతం ఎక్కువగా ఉన్నదని, కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ 10 శాతం ఉంటేనే 8,110 చెల్లిస్తున్నారని.. 10 శాతం తగ్గితే రూ.7 వేల లోపే ఇస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం కొర్రీలు, మరోవైపు స్లాట్ బుకింగ్‌లు వంటి నిబంధనలతో రైతులు గ్రామాల్లో మధ్యదళారులకే తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు.
ఈ వానకాలంలో జిల్లాలో పత్తిని సాగుచేసిన వారిలో కౌలురైతులే అధికంగా ఉన్నారు. వీరు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర పొందాలంటే కపాస్ కిసాన్ యాప్‌లో రైతు పాస్‌బుక్ నంబర్‌ను జతచేయాల్సి ఉంటుంది. కానీ, భూములు మరొక్కరి పేరుతో ఉండడంతో వీరు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కౌలు రైతులు తక్కువ ధరకే మధ్యదళారులకు విక్రయిస్తున్నారు. కాగా, జిల్లాలో సుమారు 60,000-70,000 ఎకరాల్లో కౌలు రైతులే పత్తిని సాగుచేసినట్లు అధికారులు నిర్ధారించారు.
జిల్లాలోని రైతులకు మద్దతు ధర చెల్లించడంతోపాటు కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటుచేయడం కోసం జిల్లాస్థాయిలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్ సారథ్యంలో ఈ కమిటీ పనిచేస్తుంది. అయితే, ఈ కమిటీ రైతులకు అందుబాటులో లేదు. పత్తి రైతులకు అవసరమైన చోట కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు వారికి మద్దతు ధర ఇప్పించడం, యాప్‌పై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేయాల్సిన పర్యవేక్షణ కమిటీ పత్తాలేదని ఆరోపణలొస్తున్నాయి.
ఆరుగాలం శ్రమించి అప్పులు చేసి పత్తిని సాగు చేశా. ఇప్పటివరకు కురిసిన వర్షాలతో పంట దిగుబడి అనుకున్న స్థాయిలో రాలేదు. పంటలో తేమశాతం పేరుతో అధికారులు కొనుగోలు ముందుకు రావడంలేదు. చేసేదేమీ లేక మధ్యదళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నాం.
-చంద్రయ్య, నల్లచెరువు, మాడ్గుల మండలం
జిల్లాలో పత్తిని సీసీఐ ఆధ్వర్యంలో సేకరించేందు కు 12 జిమ్మిం గ్ మిల్లులను అధికారులు నోటిఫై చేశా రు. షాద్‌నగర్, కేశంపేట, నందిగామ, ఆమనగ ల్లు, తలకొండపల్లి, పోలేపల్లి, ఆకుతోటపల్లి వంటి ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించా రు. కానీ, ఇప్పటివరకు కేవలం నాలుగు కేం ద్రాలను మాత్రమే ప్రారంభించారు. చేగూరు, షాద్‌నగర్, ఆమనగల్లు, తలకొండపల్లిలో మా త్రమే ఏర్పాటు చేసి.. పత్తిని అధికంగా పం డించే మాడ్గుల, కడ్తాల్, కందుకూరు, యాచారం వంటి మండలాల్లో ఇప్పటికీ వాటి ఊసేలేదు. జిల్లాలో వేసిన పత్తిలో సగానికి పైగా ఈ మండలాల్లోనే సాగుచేశారు. మాడ్గుల, కడ్తాల్, కందుకూరు, యాచారం మండలాలకు చెందిన రైతులు కలెక్టర్‌ను కలిసి మా డ్గుల లేదా మాల్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలనుకుంటే 70 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఆమనగల్లు, తలకొండపల్లి, షాద్‌నగర్, నందిగామకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో రైతులు అంత దూరం వెళ్లలేక మధ్య దళారులకే తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు.