రంగారెడ్డి, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్లపై విధిస్తున్న నిబంధనలతో పత్తి కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు, పత్తిని అమ్ముకోవాలనుకున్న అన్నదాతలకు ఈ నిబంధనలు గుదిబండగా మారుతున్నాయి. ఒక రైతు నుంచి ఎకరాకు ఏడు క్వింటాళ్ల కంటే ఎక్కువ పత్తిని కొనబోమని సీసీఐ అధికారులు తెగేసి చెప్తున్నారు. ఈ నిబంధనలతో రైతులు తమ మిగతా పత్తిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఓవైపు వరుస వర్షాలతో కుదేలైన అన్నదాతలకు సీసీఐ పెడుతున్న నిబంధనలు మరింత కుంగదీస్తున్నాయి. ఇటీవల కురిసిన మొంథా తుపానుకు పత్తి తడిసినందున కొనుగోలు చేసే ఉద్దేశం లేకనే సీసీఐ నిబంధనలను తెర మీదకు తీసుకువచ్చిందని రైతులు వాపోతున్నారు. కాగా, ఈ సంవత్సరం ఆశించిన రీతిలో వర్షాలు రావడంతో రైతులు పెద్దఎత్తున పత్తిని సాగుచేశారు. అలాగే, దిగుబడి కూడా అంతే ఎత్తున వస్తుందని ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలపై నిబంధనల నీరు చల్లినట్లయ్యింది.
తాము పండించిన పంటను స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని పలువురు అన్నదాతలు వాపోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పత్తిని అమ్ముకోవాలంటే స్లాట్ బుకింగ్ చేసుకోవల్సి వస్తున్నది. కాని, గ్రామీణ ప్రాంతాల రైతులకు స్లాట్ బుకింగ్ విధానం తెలియక తక్కువ ధరలకే మధ్య దళారులకు విక్రయిస్తున్నారు. కొత్తగా ఒక రైతు నుంచి ఎకరాకు ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేస్తామన్న నిబంధన మరింత శాపంగా మారింది. మిగతా పత్తిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇటీవల వర్షాలకు తడిసిన పత్తిని కొనుగోలు చేయబోమని చెప్తుండగా.. మరోవైపు స్లాట్ బుకింగ్ విధానం అన్నదాతలను మరింత అయోమయానికి గురిచేస్తున్నది. ఈ పరిస్థితిలో గ్రామాల్లో తక్కువ ధరలకే రైతులు మధ్య దళారులకు పత్తిని విక్రయిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు రూ.8,100 మద్దతు ధర ఉండగా.. మధ్య దళారులకు రూ.6వేలకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లని పరిస్థితి ఏర్పడిందని పలువురు అన్నదాతలు వాపోతున్నారు.
ఆమనగల్లు, నవంబర్ 10 : పత్తి రైతుల నుంచి ఒక ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనే పరిమితిని సర్కారు ఎత్తివేయాలని గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు, బీఆర్ఎస్ ఆమనగల్లు మున్సిపాలిటీ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ డిమాండ్ చేశారు. సోమవారం ఆమనగల్లు మండల పరిధిలోని ఆకుతోటపల్లి గ్రామ సమీపంలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేస్తున్న ఎన్డీటీ పత్తి కేంద్రాన్ని ఆయన పరీశీలించారు. ఈ సందర్భంగా పత్తి రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల నుంచి 20 శాతం తేమ ఉన్న పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే మాత్రమే కొనుగోలు చేస్తామనడం సరైన విధానం కాదని, మిగతా పత్తిని రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వాలు వెంటనే నిబంధనలు ఎత్తివేసి ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు కోసం తీసుకువచ్చిన కపాస్ కిసాన్ యాప్ గురించి సాంకేతిక అవగాహన లేక రైతులు యాప్లో నమోదు చేయలేకపోవడంతో పత్తిని సీసీఐ కేంద్రాలు కొనుగోలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై లేదన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన సీసీఐ అధికారి రాజీవ్ లోచన్ బిషోయ్కు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ రమేశ్నాయక్ ఉన్నారు.