ఇబ్రహీంపట్నం,అక్టోబర్ 27 ; ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటకు గిట్టుబాటు ధర రావడంలేదు. మద్దతు ధర ఇచ్చి కొంటామన్న ప్రభుత్వం.. ఇంకా కొనుగోలు కేంద్రాలనే ఏర్పాటు చేయలేదు. విధిలేని పరిస్థితుల్లో అన్నదాతలు పత్తిని దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. తాను కలలోనూ దళారులకు విక్రయించాల్సిన దుస్థితి వస్తుందని ఊహించలేదని యాచారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు దూదిమెట్ల ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. రంగారెడ్డి జిల్లాలో వరి తర్వాత రైతులు పత్తి పంటను సాగు చేస్తారు. మంచాల, యాచారం, మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల్, షాద్‌నగర్, ఫరూఖ్‌నగర్, చేవెళ్ల, షాబాద్ మండలాల్లో పత్తిని అత్యధికంగా సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో జిల్లా రైతులు లబోదిబోమంటున్నారు.
జిల్లాలో లక్షా 26 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు..
జిల్లాలోని రైతులు ఈ వానకాలంలో 1,26,000 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా.. 1,15,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పెట్టిన పెట్టుబడులు వస్తాయని భావించారు. కానీ, పత్తిని ఏరి ఇండ్లకు తీసుకొస్తున్నా ఇంకా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇండ్లలో పత్తిని నిల్వ చేసుకోలేని రైతులు దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టాలపాలవుతున్నారు. సర్కారు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఉంటే మద్దతు ధర వచ్చి పెట్టిన పెట్టుబడులు వచ్చేవని.. ఇప్పుడు దళారులకు విక్రయించడంతో అప్పులపాలు అవ్వాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 16 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు..
జిల్లాలోని రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసేందుకు 16 కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆమనగల్లు పరిధిలో 14 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ మిల్లుల్లో ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు చెందిన రైతులు విక్రయించేందుకు వెసులుబాటు కల్పించనున్నారు. అలాగే ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దులాపూర్‌మెట్ ప్రాంతాలకు చెందిన రైతులకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సంఘీలో, షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాలకు చెందిన రైతులకు చేవెళ్లలో కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ, ఇప్పటివరకు జిల్లాలో ఏ ఒక్క కేంద్రం కూడా ఏర్పాటు కాకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు.
దీపావళి తర్వాతే కొనుగోళ్లు..
జిల్లాలో దీపావళి పండుగ తర్వాతే పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. ఇందుకోసం 14 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వివిధ జిన్నింగ్ మిల్లులతోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో పత్తిని కొంటాం. ప్ర స్తుతం తేమ శాతం అధికంగా ఉండటంతో పత్తి కొనుగోళ్లు ప్రారంభించలేదు.
-మహ్మద్‌రియాజ్,జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి
నానిన పత్తిని కొనాలి..
పత్తికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి. ఇటీవల కురిసిన వానలతో పత్తి నానిపోయింది. ఆ పంటను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. దళారులు క్వింటాల్‌కు రూ.5000 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం 8 వేల క్వింటాలుకు పత్తిని కొనాలి.
– కట్ట మల్లయ్య మాడ్గుల గ్రామం, మాడ్గుల
ధర లేక నష్టపోతున్నాం..
పత్తికి ధర లేక చాలా నష్టపోతున్నాం. అప్పులు చేసి పంటను సాగు చేశాం. కానీ, పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం పత్తికి మద్దతు ధరను పెంచి రైతులను ఆదుకోవాలి. గతేడాది 7000-9000 ధర పలికింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 5000-6000 ఉండడం దురదృష్టకరం. క్వింటాల్ పత్తికి రూ.8000 ధరను ప్రభుత్వం నిర్ణయించాలి.
– భూతరాజు రమేశ్, నల్లచెరువు గ్రామం, మాడ్గుల