రంగారెడ్డి, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : వర్షాభావ పరిస్థితులు అనుకూలించడంతో జిల్లావ్యాప్తంగా పత్తి, వరి పంటలను గణనీయంగా సాగుచేశారు. కాని, పంట చేతికందే సమయంలో ప్రభుత్వాల నిబంధనలతో రైతులకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఏర్పడింది. ఈ ఖరీఫ్ సీజన్లో 1.30 లక్షల ఎకరాల్లో వరి, 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మరో 30వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేశారు. సాగు విస్తీర్ణం పెరగడంతో ఈ ఏడాది దిగుబడి అధికంగా వచ్చి అప్పులు తీరుతాయని భావించిన రైతులకు నిబంధనలు అడ్డంకిగా మారాయి. కూలీల కొరత కారణంగా వ్యవసాయ పనుల్లో యంత్ర సామగ్రిని అధికంగా వాడటంతో రైతులకు పెట్టుబడితోపాటు యంత్రాల వినియోగం వంటి వాటితో ఖర్చు విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రైతులకు ఆశించిన లాభాల కంటే నష్టమే అధికంగా ఉంది.
యంత్రాల వినియోగంతో అదనపు భారం
కూలీల కొరత విపరీతంగా పెరగడంతో రైతులు వరినాట్లు, కలుపుతీత, మందుల పిచికారీ వంటి పనులను కూడా యంత్రాలతోనే చేయిస్తున్నారు. వరికోతలు సైతం యంత్రాల ద్వారానే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడితోపాటు యంత్రాల వినియోగంతో ఖర్చు తడిసి మోపెడవుతున్నది. ప్రభుత్వ నిబంధనలు మధ్యదళారులకు వరంగా మారాయి. ప్రభుత్వం పేరుకు మాత్రమే పత్తి, వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ రోజుకో కొత్త నిబంధన అమలులోకి తీసుకొస్తుండటంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లడానికి వెనుకడుగేస్తున్నారు.
విధిలేని పరిస్థితుల్లో మధ్యదళారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం పత్తికి మద్దతు ధర రూ.8,110 ప్రకటించగా, ప్రభుత్వ నిబంధనలు తేమ శాతం వంటి కారణాలతో రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లడంలేదు. రూ.6500 నుంచి రూ.7,000 వరకు రైతులు మధ్యదళారులకు విక్రయిస్తున్నారు. వరి ధాన్యానికి కూడా అదే పరిస్థితి. దీంతో ఖరీఫ్ సీజన్లో రైతులు ఆశించింది ఒకటైతే.. ఆచరణలో మరో సమస్య ఎదురవుతున్నాయి.
నిబంధనలు లేకుండా..
నిబంధనలు లేకుండా రైతుల నుంచి వరి, పత్తి పంటలను మద్దతు ధర అందించి కొనుగోలు చేయాలి. ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలతో అన్నదాతలు చేసేదేమీలేక మధ్యదళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఓవైపు అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు నిబంధనలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి.
– సత్తు వెంకటరమణారెడ్డి