అవినీతి అక్రమాలకు కేరాఫ్‌గా మారిన జిల్లా మత్స్యశాఖ ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతున్నది. మూడు నెలల వ్యవధిలోనే జిల్లా మత్స్యశాఖలో ఇద్దరిపై వేటు పడింది. మత్స్య సహకార సంఘాల ఏర్పాటు మొదలుకొని సభ్యత్వాల జారీ వరకు సంబంధిత అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
మత్స్యకార్మికుల నుంచి యూపీఏ యాప్‌ల ద్వారానూ లంచాలు స్వీకరించిన సందర్భాలున్నాయి. చెరువుల లీజు డబ్బులను సైతం సొంతానికి వాడుకున్నారు. వివిధ పథకాల కింద మంజూరైన పనులను చేపట్టకుండానే బిల్లులు పొందారంటూ కొంతమంది మత్స్యకారులు ఏకంగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా మత్స్యశాఖలో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రక్షాళన చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
అంతా అవినీతిమయం..
రంగారెడ్డి జిల్లాలో 799 వరకు చెరువులు, కుంటలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు 162, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు 114 ఉన్నాయి. మరో ఆరు పారిశ్రామిక మార్కెటింగ్ సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 9,136 మంది మత్స్య కార్మికులు సభ్యులుగా కొనసాగుతున్నారు. అయితే సొసైటీల ఏర్పాటు, సభ్యత్వం తదితర వాటిల్లో అధికారులు అక్రమంగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి.
ఒకే ప్రాంతంలో రెండు సొసైటీలకు అనుమతులు ఇవ్వొద్దన్న నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారన్న విమర్శలు మత్స్యకారుల నుంచి వినిపిస్తున్నాయి. సభ్యత్వాలను సైతం అడ్డగోలుగా ఇచ్చారన్న ఫిర్యాదులు ఉన్నాయి. చేప పిల్లల పంపిణీలోనూ అక్రమాలకు పాల్పడినట్లు ఇక్కడి అధికారులతోపాటు, ఉన్నతాధికారులపై ఫిర్యాదులు వెళ్లాయి. లంచాల డబ్బులను సైతం యూపీఏ యాప్‌ల ద్వారా వసూలు చేయడం అధికారుల బరితెగింపునకు అద్దంపడుతున్నది.
అక్రమాలపై ఏసీబీకి ఫిర్యాదు..
జిల్లా మత్స్య శాఖలో వివిధ ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలు జరిగాయంటూ పలువురు మత్స్యకారులు ఈ ఏడాది మే నెలలో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. నీలి విప్లవం, రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వంటి పథకాల ద్వారా లబ్ధిదారులకు పథకాలను మంజూరు చేసిన సందర్భంలో అధికారులు వాటాలు వేసుకుని మరీ వసూలు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
చేపల చెరువులను నిర్మించుకుండానే బిల్లులను కాజేశారన్న ఆరోపణలు సైతం వస్తున్న తరుణంలో ఆయా పథకాల ద్వారా మంజూరు చేసిన పనులపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ ఏసీబీకి కొందరు మత్స్యకారులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇప్పటిదాకా తేల్చింది కొంతే! అని తేల్చాల్సిందే ఇంకా చాలా ఉందని మత్స్యకారులు పేర్కొంటున్నారు.
మత్స్యశాఖ అధికారిపై సస్పెన్షన్ వేటు..
మత్స్యకారుల నుంచి వెళ్లిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు కమిటీ వేసి అక్రమాల నిగ్గు తేల్చారు. చేపల చెరువులకు సంబంధించిన లీజు డబ్బులను ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా సొంతంగా వాడుకున్నట్లు విచారణ అధికారులు తేల్చారు. రూ.62,547 లీజు డబ్బులను సూపరింటెండెంట్ సీహెచ్ రమేశ్‌ను వాడుకున్నట్లు విచారణలో తేలింది. అలాగే.. కార్యాలయంలో ఫర్నిచర్ ఏర్పాటు పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు సైతం తేలింది. ఈ క్రమంలో అతన్ని మూడు నెలల క్రితం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఆ తర్వాత మరింత లోతుగా విచారణ జరిపిన విచారణ కమిటీ జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తిని సైతం బాధ్యులుగా చేసింది. ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్ ప్రియాంక ఈ నెల 9న సుకీర్తిపై సస్పెన్షన్ వేటు వేసింది. మత్స్యశాఖలో ఏడీఎఫ్‌గా పనిచేస్తున్న చరితకు ఎఫ్‌డీవోగా ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చేలా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.