రంగారెడ్డి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఇటీవల ఏసీబీ వరుస దాడులతో జిల్లాలో అవినీతి తిమింగలాలు బయటపడుతున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ శివారులో విస్తరించి ఉన్న జిల్లాలోని భూములకు డిమాండ్ బాగా ఉండడంతో రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతున్నది. పలు కార్యాలయాల్లో ఫైళ్లు ముందుకు కదలాలంటే పైసలు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. భూభారతి ఫైళ్ల క్లియరెన్స్‌లో భాగంగా ప్రతి ఫైల్‌కు అధికారులు కొంత రేట్‌ను ఫిక్స్ చేశారన్న ఆరోపణలున్నాయి. పట్టాదారుల పేర్ల మార్పు, మిస్సింగ్ సర్వేనంబర్లు, నిషేధిత జాబితా నుంచి తొలగింపు వంటి పనులకు డబ్బులు లేనిదే పనులు సాగడం లేదని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఇప్పటికే ఆమనగల్లు, తలకొండపల్లి తహసీల్దార్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఇద్దరూ భూ సమస్యల పరిష్కారం పేరుతోనే దొరికిపోయారు. అలాగే, ఇబ్రహీంపట్నం లో ఆర్ఐ కూడా పట్టుబడ్డారు. విద్యుత్ శాఖలోనూ పలువురు అధికారులు ఇటీవల ఏసీబీకి చిక్కారు. వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ లంచం తీసుకుం టూ, తాజాగా నార్సింగి మున్సిపాలిటీలో టౌన్‌ప్లానింగ్ అధికారి ఏకంగా రూ. నాలుగు లక్షల తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
రెవెన్యూ, రిజిస్ట్రార్, సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల బాగోతం నడుస్తున్నది. రెవెన్యూ కార్యాలయాలకు పనుల కోసం వెళ్లిన వారిని రూ. లక్షల్లో డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. డబ్బులు ఇస్తేనే మీ పని సాఫీగా జరుగుతుందని, లేదంటే సారు మీ పని చేయడని కింది స్థాయి ఉద్యోగులు బహిరంగంగానే చెబుతున్నట్లు పలువురు రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. పనిని బట్టి రేటును నిర్ణయించి వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎక్కడో అక్కడ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టిస్తున్నా రెవెన్యూ శాఖలో మాత్రం అక్రమ వసూళ్లు ఆగడంలేవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ పంచాయతీ కార్యదర్శులు ఏ పనిని చేయాలన్నా లంచాలు అడుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపాలిటీల్లో అవినీతి అధికారులుగా ముద్రపడ్డ పలువురి జాబితా ఏసీబీ అధికారులకు చేరినట్లు సమాచారం. వారి అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. జిల్లా పరిధిలోని ఔటర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులే టార్గెట్‌గా ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు, త్వరలోనే వారి బండారం బయటపడనున్నట్లు పలువురు అధికారులు పేర్కొంటున్నారు.