పరిగి, సెప్టెంబర్ 25 : స్థానిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా అధికారు ల తీరు విస్మయానికి, ఆశ్చర్యానికి, అయోమయానికి గురి చేస్తున్నది. ఒక ఉపాధ్యాయుడికి ఏకంగా నాలుగు మండలాల్లో ప్రిసైడింగ్ అధికారి శిక్షణ తరగతులకు హాజరు కావాల్సిందిగా ఉత్తర్వులు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్ జిల్లా ఎన్నికల అథారిటీ పనితీరుపై విమర్శలొస్తున్నాయి. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాల్లో భాగంగా ఈనెల 26న అన్ని మండలాల్లో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తరగతులకు హాజరుకావాల్సిందిగా జిల్లా ఎన్నికల అథారిటీ పేరిట ఉత్తర్వులొచ్చాయి.
ఒక టీచర్‌కు నాలుగుచోట్ల శిక్షణకు హాజరుకావాలని ఉత్తర్వులు రావడం విడ్డూరంగా ఉన్నది. పరిగి పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ నం.2లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సత్యనారాయణరెడ్డి(ఎంప్లాయీ కోడ్ 1433310)కి 26న ఉదయం 10.30 గంటలకు కులకచర్ల మండల కేంద్రంలోని రైతువేదికలో, అదేవిధంగా ఉదయం 10.30 గంటలకు వికారాబాద్‌లోని అంబేద్కర్‌భవన్‌లో.. 26న మధ్యా హ్నం 2.30 గంటలకు యాలాల రైతువేదికలో, అదేవిధంగా మధ్యా హ్నం 2.30 గంటలకు ధారూరు రైతు వేదికలో శిక్షణకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒకేరోజు ఉదయం ఒకే సమయంలో రెండు మండలాలు, మధ్యాహ్నం ఒకే సమయంలో మరో రెండు మండలాల్లో శిక్షణకు ఎలా హాజరుకావాలని సదరు ఉపాధ్యాయుడు అయోమయంలో పడ్డారు.
స్థానిక ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక ప్రిసైడింగ్ అధికారికి ఒకచోట శిక్షణ ఇస్తే సరిపోతుంది. అలాంటిది నాలుగు మండలాల్లో శిక్షణ ఇస్తే, నాలుగుచోట్ల పాల్గొనడం ఎలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. పలువురు టీచర్లకు రెండు మూడు చోట్ల శిక్షణకు హాజరుకావాలని పిలుపు వచ్చినట్లు సమాచారం. ఏడాది కిందట నియమితులైన, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అనుభవం లేని నూతన టీచర్లకు ప్రిసైడింగ్ అధికారులుగా నియమించడం విమర్శలకు తావిస్తున్నది.