వికారాబాద్, ఫిబ్రవరి 20, (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి గెలిపిస్తే ఇబ్బందుల పాలు చేయడంపై జిల్లాలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలిచాలని జీతాలతో బతుకునీడుస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు సమయానికి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఒక్క శాఖనో కాకుండా అన్ని శాఖలకు సంబంధించిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. కుటుంబ పోషణతోపాటు తీసుకున్న ఇంటి సామగ్రి తదితరాలకు ఈఎంఐలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. మరికొందరు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు గత రెండు, మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో అప్పులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న జీతాలతోపాటు ఇకపై ప్రతి నెలా సమయానికి జీతాలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే సమయానికి జీతాలతోపాటు ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉండేవని పేర్కొంటున్నారు.
గత రెండు, మూడు నెలలుగా అందని జీతాలు..
జిల్లాలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేక వెతలు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేలకుపైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గత రెండు, మూడు నెలలుగా జీతాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య శాఖకు సంబంధించి ఏఎన్ఎంలు మొదలుకొని ఫార్మాసిస్ట్లు, స్టాఫ్ నర్సులు, వైద్యులకు మూడు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న దాదాపు 200 మందికీ రెండు నెలలుగా జీతాలు రావడం లేదు. వీరిలో ఆఫీస్ సబార్డినేట్లు మొదలుకొని కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలకు జీతాలు అందలేదు. విద్యా శాఖలో అత్యధికంగా 750 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు అందని పరిస్థితి నెలకొన్నది. వీరిలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగులు ఉన్నారు. విద్యా శాఖలో పని చేస్తున్న సీఆర్పీలు, ఎంఐసీలు, పీటీఐలతోపాటు కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు జీతాల కోసం విన్నవిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వమే నిధులు విడుదల చేయడంలేదని, దీంతో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి.
ప్రభుత్వాసుపత్రుల్లో నిలిచిన ఉచిత భోజనం..
పేద ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా నిలిచిపోతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవమైతే కేసీఆర్ కిట్స్తోపాటు అందించిన ఆర్థిక సాయం మూడు నెలలుగా నిలిచిపోయింది. గర్భిణులకు సరైన పోషకాలు అందిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని, పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉంటారని గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం గర్భిణులకు అందించిన న్యూట్రీషన్ కిట్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బంద్ అయ్యాయి. ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు అయిన మహిళలకు ఆసుపత్రుల్లో ఉండే వారం, పది రోజులపాటు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా భోజనం అందించేందుకుగాను నిధులిచ్చేది. గత మూడు నెలలుగా నిధులు రాకపోవడంతో ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత భోజనం బంద్ అయ్యింది. గత ప్రభుత్వం టీబీ రోగులకు ప్రతి నెలా రూ.500ల చొప్పున సాయం చేస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి టీబీ రోగులకిచ్చే ఆర్థిక సాయం ఆగిపోయింది. దీంతో జిల్లాలోని 1600 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు.
జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాం..
గత ఒక 5 నెలల నుంచి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. జీతాలు వస్తాయన్న నమ్మకంతో విధులకు హాజరవుతున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నాం. గత ఐదు నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఆపసోపాలు పడుతున్నాం. ఇప్పటికైనా వైద్య సిబ్బందికి ఇవ్వాలి. మమ్మల్ని ప్రోత్సహిస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందిస్తాం. త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీతాలను వేయాలని వేడుకొంటున్నా.
– సంతోశ్‌కుమార్, ల్యాబ్ టెక్నీషియన్, పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
టీఏలను ప్రభుత్వం ఆదుకోవాలి..
ఉపాధి హామీ పథకంలో టీఏలుగా పని చేస్తున్న సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలి. మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబం గడువడం కష్టంగా ఉన్నది. తీసుకున్న సామగ్రి, లోన్ల ఈఎంఐలు నిలిచిపోయాయి. గత 2006 సంవత్సరం నుంచి మహాత్మాగాంధి ఉపాధి హామీ పథకంలో టీఏగా పని చేస్తున్నా. గత ప్రభుత్వం పే స్కేలు ఇస్తామని హామీ ఇచ్చింది. అంతలోనే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇవ్వలేదు. ఇప్పటికైనా ఉపాధి హామీ టీఏలకు పే స్కేలు అమలు చేసి ఆదుకోవాలి.
– శ్రీనివాస్, టీఏ ఉపాధి హామీ పథకం, ధారూరు మండలం