రంగారెడ్డి, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలనలో భాగంగా గుర్తించిన గ్రామాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు రాక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. కా గా, జిల్లాలోని 21 మండలాల్లో 21 గ్రామాలను ప్రజాపాలనలో పైలెట్ గ్రామాలుగా అధికారులు ఎంపిక చేశారు.
ఈ పథకం కింద ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ.ఐదు లక్షలు ఇవ్వనుండడంతో పేదలు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి గ్రామానికీ 70 నుంచి 100 మంది వరకు లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకోగా.. అధికారులు మా త్రం 1,442 మందిని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా ఎం పిక చేశారు.
అందులో ఇప్పటివరకు 300 మంది మాత్రమే ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోయగా.. 58 ఇండ్లు బేస్మెంట్ల వరకు పూర్తి కాగా వాటి లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాలేదని.. అప్పులు తీసుకొచ్చి బేస్మెంట్ వరకు నిర్మించినట్లు.. ప్రస్తుతం పనులను నిలిపేసినట్లు పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఆ బిల్లులను త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఉన్న ఇంటిని కూలగొట్టి..
ప్రజాపాలనలో సొంతింటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఉచితంగా ఇస్తామని ప్రకటించటంతో కప్పాడు గ్రామానికి చెందిన జెంగిలి లక్ష్మమ్మ అనే మహిళ ఉన్న ఇం టిని కూలగొట్టి.. ఆ స్థలంలో కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించింది. గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో కుటుంబంతో కలిసి జీవిస్తున్నది.
ఇప్పటివరకు ఇంటి నిర్మాణం బేస్మెంట్ వరకు పూర్తైనా ప్రభుత్వం నుంచి రూపాయీ రాకపోవడంతో ఆ పనులను నిలి పేసింది. ఇంటి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకుందామని ఉన్న ఇంటిని కూలగొట్టి.. తెలి సిన వారి వద్ద వడ్డీని డబ్బును తీసుకొచ్చి కొత్త ఇంటి పనులను చేపడితే.. ప్రభుత్వం నుంచి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించి బిల్లులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నది.
బిల్లుల కోసం నిబంధనలెన్నో..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు ఇచ్చే రూ. ఐదు లక్షలను నాలుగు విడతలుగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బేస్మెంట్ స్థాయి వరకు నిర్మించిన వారికి రూ. లక్ష, ఆపైన నిర్మాణాలు జరిపిన వారికి లక్షాయాభై వేలు, లక్షా యాభై వేలు రెండు దఫాలుగా, ఇండ్ల నిర్మాణం పూర్తైన తర్వాత రూ.లక్ష ఇస్త్తామని ప్రకటించింది. అయితే, బేస్మెం ట్ వరకు నిర్మాణాలు పూర్తి కాగానే రావాల్సిన లక్షరూపాయల బిల్లులు మాత్రం ఇంకా రావడం లేదు.
బేస్మెంట్ నిర్మాణం పూర్తైన లబ్ధిదారుల రూ.లక్ష బిల్లు కోసం వారు బ్యాంకులో అకౌంట్ తెరిచి ఆధార్లింకు చేయాల్సి ఉంటుం ది. ఆధార్ లింక్ కాగానే బేస్మెంట్ వరకు చేపట్టిన నిర్మాణం వద్ద లబ్ధిదారులు ఫొటోలు దిగి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే బిల్లులు వారికి మంజూరవుతాయి.
బిల్లులు త్వరగా చెల్లించాలి..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరగా బిల్లులను చెల్లించాలి. చాలామంది ఉన్న ఇండ్లను కూలగొట్టి, ఆ స్థలాల్లో ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టి.. బేస్మెంట్ వరకు పూర్తి చేశారు. ఆ పనులకు ఇంకా రూపాయీ రాకపోవడంతో మిగిలిన పనులను చేపట్టే స్థితిలో లబ్ధిదారులు లేదు. ప్రభుత్వం స్పందించి త్వరగా బిల్లులను చెల్లించి, ఆదుకోవాలి.
-చెరువుకింది సురేశ్, కప్పాడు
అప్పులు చేసి బేస్మెంట్ వరకు పూర్తి చేశా.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా కొత్త ఇంటిని నిర్మించేందుకు ఉన్న ఇంటిని కూలగొ ట్టి.. ఆ స్థలంలో నిర్మాణ పను లు ప్రారంభించా. ప్రస్తుతం గ్రామంలోని కమ్యూనిటీహాల్లో కుటుంబంతో కలిసి జీవిస్తున్నా. ప్రభుత్వం వెంటనే బిల్లులను చెల్లిస్తే స్లాబ్ వేసుకుని మళ్లీ ఆ ఇంట్లోకి వెళ్లిపోతా.