రంగారెడ్డి, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రాత్రికి రాత్రే ఎన్వోసీలు పుట్టుకొస్తున్నాయి. కొంతమంది అధికారుల అండదండలతో ఎన్వోసీలు పొంది చెరువులు, కుంటలను మాయం చేస్తున్నారు. ము ఖ్యంగా జిల్లాలోని పెద్దఅంబర్‌పేట, నార్సింగి, తుక్కుగూడ, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఆదిబట్ల, తుర్కయాంజాల్ వంటి మున్సిపాలిటీల్లో ఎన్వోసీల జారీ వ్యవహారం జోరుగా సాగుతున్నది. ఈ మున్సిపాలిటీల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో రియల్ఎస్టేట్ వ్యాపారులు చెరువు శిఖం పట్టాల్లో కొంతమంది అధికారుల అండతో జోరు గా ఎన్వోసీలు పొంది.. వాటి ఆధారంగా హెచ్ఎండీఏ అనుమతులు తీసుకొని వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వానలకు ఈ వెంచర్లలో నిర్మించిన ఇండ్లు నీటమునిగాయి. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్‌చెరువు గతంలో 500 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. ప్రస్తుతం ఈ చెరువు 200 ఎకరాలకు కుంచించుకుపోయింది. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఓ వైపు కోర్టులో వివాదం కొనసాగుతుండగానే.. మరోవైపు చెరువును పూడ్చివేస్తున్నారని పలువురు స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుర్కయాంజాల్, ఆదిబట్ల, మీర్‌పేట వంటి మున్సిపాలిటీల్లో చెరువుల ఆక్రమణలు అధికంగా ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.
జిల్లాలో 867 చెరువులు
అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 867 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల ఎఫ్టీఎల్ను గుర్తించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించినా ఎఫ్టీఎల్ గుర్తించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్ప టివరకు జిల్లాలోని 260 చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ను గుర్తించి అధికారులు తుది నివేదికను ఇచ్చారు. జిల్లాలోని చెరువులన్నీ హైదరాబాద్‌కు అతిసమీపంలో ఉండడంతో కొందరు కబ్జాదారులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు ఏకంగా చెరువులను మింగేసే పనిలో పడ్డారు. వీరంతా రాత్రికి రాత్రే చెరువుల్లో మట్టిని నింపి వెంచర్లు చేస్తున్నా రు. చెరువులు, కుంటల ఆక్రమణలు అరికట్టాల్సిన రెవె న్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారని.. అందుకే యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాత తేదీల్లో ఎన్వోసీలు..
జిల్లాలోని పలు చెరువులు, కుంటల ఆక్రమణల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ చెరువుల పరిధిలో గతంలో పనిచేసిన అధికారుల నుంచి పాత తేదీల్లో ఎన్వోసీలు తీసుకొచ్చి కొందరు శిఖం పట్టాల్లో వెంచర్లు చేస్తున్నారు. ఎన్వోసీల జారీకి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారుల జాయింట్ సర్వే నిర్వహించి అనుమతులి వ్వాలి. కానీ, కొంతమంది రియల్ఎస్టేట్ వ్యాపారులు ఈ నిబంధనలు పక్కనపెట్టి గతంలో పనిచేసిన అధికారుల వద్దకు వెళ్లి ఎన్వోసీలు పొందుతున్నారు.
మాసబ్‌చెరువు కబ్జాపై విజిలెన్స్ విచారణ..
జిల్లాలోని అతిపెద్దదైన తుర్కయాంజాల్ మాసబ్‌చెరువు ఆక్రమణలపై మంగళవారం విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. మాసబ్‌చెరువులో ఇప్పటికే జరిగిన అక్రమ నిర్మాణాలపై ఓ వైపు వివాదం కొనసాగుతుండగా..మంగళవారం అక్క డ కొందరు నిర్మాణాలు చేపట్టేందుకు చెరువును పూడ్చివేస్తుండడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారి అరుణారెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా చెరువు ఆక్రమణలపై పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కొందరు అక్రమంగా ఎన్వోసీలు తీసుకొచ్చి చెరు వు ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమిస్తున్నారని, ఈ చెరువు ఎగువ ప్రాంతంలో ఉన్న ఆదిత్యనగర్, శోభానగర్, ఇంజాపూర్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆక్రమణలు చేపడుతున్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు.
కబ్జాలతో చెరువుల ఉనికికే ప్రమాదం
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు, తుర్కయాంజాల్ మాసబ్‌చెరువు, రావిర్యాల పెద్దచెరువు చరిత్రకు నిలువుటద్దంగా ఉన్నాయి. కాలక్రమేణా అధికారుల అండదండలతో అవి కనుమరుగవుతున్నాయి. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు విస్తీర్ణం 400 ఎకరాలకు పైగా ఉండగా.. కొందరు రియల్ఎస్టేట్ వ్యాపారులు చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న శిఖం భూముల్లో అక్రమంగా ఎన్వోసీలు పొంది.. వాటి ఆధారం గా వెంచర్లు ఏర్పాటు చేశారు. ఈ వెంచర్లలో ఇండ్లు నిర్మించుకున్న అనేకమంది ఇటీవల కురిసిన వర్షాలకు ఇండ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి చెరువు ఎఫ్‌టీఎల్‌లోనూ యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి. చెరువు ఎగువభాగం లో చేపట్టిన విల్లాల నిర్మాణంతో చెరువు ఉనికికే ప్రమాదం ఏర్పడడంతోపాటు చెరువులోకి నీరొచ్చే మార్గాలూ మూసుకుపోయాయి. అలాగే, రావిర్యాల పెద్దచెరువు కూడా ఆక్రమణలకు గురైంది. ఈ చెరువు పరిధిలోని శిఖం పట్టాలను కొందరు అక్రమ మార్గంలో కొని భవనాలు నిర్మిస్తున్నారు. శిఖం పట్టాల్లో శాశ్వ త నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనలున్నా కొంతమంది అధికారుల అండదండలతో రియల్ఎస్టేట్ వ్యాపారులు అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు.