పరిగి, ఏప్రిల్ 28 : ఏదైనా నిర్మాణ పని చేపట్టాలంటే సంబంధిత పర్యవేక్షణ చేపట్టే ఇంజినీరింగ్ అధికారులు దగ్గరుండి చేయించాల్సిందిపోయి, పనులు పూర్తయినా అటువైపు వెళ్లకుండా, కేవలం కొలతలు స్వీకరించేందుకు తమ సహాయకులను పంపిస్తున్నారు. రికార్డులు చేస్తున్న తరుణంలో పనుల్లో నాణ్యతకు పూర్తిగా తిలోదకాలు ఇవ్వబడుతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చేపడుతున్న పనులు పది కాలాలపాటు ఉండాల్సిందిపోయి రెండు మూడు సంవత్సరాలకే దెబ్బతింటున్నాయి. రెండు నెలలకే వాటి నాణ్యతా లోపం బయటకు వస్తున్నది.
పరిగి పట్టణం నుంచి తుంకులగడ్డకు వెళ్లే రహదారిలో సీసీ వేశారు. కోతకు గురవకుండా సీసీ రోడ్డుకు పక్కనే సీసీతో గోడ నిర్మాణం చేపట్టారు. సీసీతో గోడను కనీసం ఒక అడుగు లోతు నుంచి నిర్మాణం చేపడితే బాగుండేది. కాగా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నిర్మాణం చేపట్టాడు. దానికి అధికారులు రికార్డు చేసి బిల్లు తయారు చేశారు. కానీ పని ఎంత పకడ్బందీగా చేశారన్నది వారు సరిగ్గా పరిశీలించలేదు. కొన్ని నెలల క్రితం కురిసిన వర్షానికి వచ్చిన వరద నీటితో ఏకంగా సీసీ గోడ కూలిపోయింది. సీసీ పని ఎంత నాణ్యతగా నిర్మించారో తెలుస్తున్నది.
ఇటీవల పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో వేసిన సీసీ రోడ్డు రెండు నెలల్లోనే దుమ్ము లేస్తూ రోడ్డుకు ఇరువైపులా ఇళ్లవారికి ఇబ్బందికరంగా మారింది. సీసీ రోడ్డు నిర్మాణంలో ఇసుకకు బదులుగా పిండి వంటి డస్ట్ వాడడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతున్నదని పేర్కొంటున్నారు. రోబో స్యాండ్ వాడినా ఇబ్బంది లేదు కానీ తక్కువ ధరకు వస్తుంది కదా అని పిండి వంటి డస్ట్ను వాడడంతో రోడ్డు నిర్మాణంలో నాణ్యత దెబ్బతింటున్నది. ఈ రోడ్డు విషయమై స్వయంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం చూసేందుకు రాకపోవడం గమనార్హం.
పర్సంటేజీలు అందితే చాలు..
సర్కారు నిధులతో పనులు జరుగుతున్న సమయంలో సంబంధిత పర్యవేక్షణ చేసే ఇంజినీరింగ్ అధికారులు అక్కడ ఉండి పని నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఏ పని ఎలా చేయాలనేది పూర్తిస్థాయిలో సదరు కాంట్రాక్టర్కు తెలియజేయాలి. వారి సూచనల మేరకు పనులు జరగాలి. కానీ వారు పని జరిగే ప్రదేశం వైపు వెళ్లడం లేదనే విమర్శలున్నాయి. ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టే సమయంలో ఇంజినీరింగ్ అధికారులు కనీసం తొంగి చూడకుండా, పని పూర్తయిన తర్వాత ఎంబీ రికార్డు రాసేందుకు కేవలం కొలతలు తీసుకోవడానికి వెళ్తున్నారనే విమర్శలు బాహాటంగానే ఉన్నాయి. తమకు అందే పర్సంటేజీలు సక్రమంగా వస్తే చాలు.. పనులెలా ఉంటే తమకెందుకులే అనే విధంగా అధికారుల తీరు ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టి పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని, పనులను స్వయంగా అధికారులు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.