యాచారం, అక్టోబర్ 8 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మార్నింగ్ వాక్‌లో భాగంగా కాంగ్రెస్ బాకీ కార్డులను నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికీ తిరుగుతూ బుధవారం ప్రజలకు పంపిణీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉందని, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందున్నాయా..? లేదా అని స్వయంగా మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ గ్యారెంటీ కార్డులను చూపించి, హామీలపై నిలదీయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ బాకీ కార్డుల ప్లకార్డులను ప్రదర్శిస్తూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యాచారంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంచి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నదన్నారు. 22 నెలల కాలంలో రైతులు, యువత, నిరుద్యోగులు, మహిళలకు బాకీపడిన మొత్తాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. రైతులందరికీ రైతు భరోసా, రుణమాఫీ చెల్లించలేకపోయిందన్నారు.
ఆడబిడ్డల పెండ్లిళ్లకు తులం బంగారం ఎటుపోయిందని ప్రశ్నించారు. నెలకు రూ.2500 ఇస్తామని ఆడబిడ్డలందరినీ మోసం చేసినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పింఛన్ పెంచుతామన్న కాంగ్రెస్ రెండేళ్లు కావొస్తున్నా పింఛన్ పెంచకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆంక్షలతో కూడిన ఇందిరమ్మ ఇండ్లతో ఎంతో మంది గృహ నిర్మాణానికి దూరమైనట్లు తెలిపారు. ఇటీవలే యూరియా కోసం రైతులు పడ్డ గోస గత పదేండ్ల కాలంలో ఏనాడూ పడలేదన్నారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని పాదయాత్రలు చేసిన కాంగ్రెస్ నాయకులు పార్టీ అధికారంలోకి వచ్చి తమకు పదవులు రాగానే రైతులను విస్మరించడం సిగ్గుచేటన్నారు.
మీర్ఖాన్పేట నుంచి యాచారం వరకు రోడ్డుకు రూ.79 లక్షలు మంజూరు చేస్తే దానిని పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఫార్మా కోసం సేకరించిన భూములను ఫ్యూచర్ సిటీకి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, అమరావతి రోడ్డు, ఫార్మాసిటీ రోడ్డు, ట్రిపుల్ఆర్ అంటూ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసుల అండతో అక్రమ కేసులు బనాయించడం, జైల్లో పెట్టించడం సిగ్గుచేటన్నారు.
ఇక్కడున్న ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్లు, అధికారులను బెదిరిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడని మండిపడ్డారు. మల్రెడ్డి హయాంలో అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో మండలంలో జడ్పీటీసీతోపాటు అధికంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలను గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ జంగమ్మ, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాశ్చా బాషా, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రాజూనాయక్, జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు రాంరెడ్డి తదితరులున్నారు.
కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డిపై మహిళలు దుమ్మెత్తిపోశారు. తమకు సంక్షేమ పథకాలు అందడంలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు రాలేదని, గ్యాస్ సబ్సిడీ రావడంలేదని, నెలకు రూ.2500 ఇవ్వలేదని, గృహజ్యోతి రాలేదని, పిల్లలకు స్కూటీలు ఇవ్వలేదని, తులం బంగారం జాడేలేదని, చివరకు బతుకమ్మ చీరలను కూడ ఇవ్వలేదని మండిపడ్డారు. వృద్ధులు ఏకంగా రేవంత్‌రెడ్డిపై బూతుల పురాణం అందుకోవడం గమనార్హం. రైతు భరోసా, రుణమాఫీ, యూరియా సమస్యలపై రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇవ్వడంలేదని వారు సైతం సర్కారుపై మండిపడుతున్నారు.
బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్
కాంగ్రెస్ బాకీ గ్యారెంటీ కార్డుల పంపిణీ కార్యక్రమంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ మొదలైంది. అన్ని గ్రామాల యువకులు, కార్యకర్తలు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు మండల కేంద్రానికి చేరుకొని కాంగ్రెస్ బాకీ గ్యారెంటీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గులాబీ జెండాలు, ప్లకార్డులు పట్టుకొని జై తెలంగాణ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. సాగర్ రహదారి గులాబీమయం కావడంతో కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం వచ్చింది.
మండల కేంద్రానికి చెందిన యువకులు పలు పార్టీల నుంచి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో మాజీ సర్పంచ్ మారోజు కళ్లమ్మ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. యాచారంలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. పార్టీలో చేరినవారిలో పూల యాదయ్య, పూల సాయి తదితరులున్నారు.
బాకీ కార్డులే కాంగ్రెస్‌ను ఓడిస్తాయి
దోమ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బాకీ కార్డులే కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాయని కారు స్పీడును ఎవరూ ఆపలేరని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. దోమ మండల పరిధిలోని పరిగి రోడ్డులోని తిమ్మాయిపల్లి శివారులో దోమ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి మహేశ్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరై కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రజలరిచ్చిన వాగ్దానాల బాకీ కార్డులను చూపించి ఎండగట్టేలా ప్రతి కార్యకర్త కంకణబద్దులు కావాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్యే సోదరుడు అనీల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఓటమి భయంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఆనందడోలికల్లో తేలియాడుతున్నారని.. వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాక బీఆర్ఎస్ పార్టీపై దుమ్మెత్తిపోయడమే కాకుండా కార్యకర్తలపై కేసులు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్యముదిరాజ్, మండల మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు ఖాజా పాషా, యువ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి
ఆమనగల్లు : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రమే అమలు చేసిన ఘనత రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకే దక్కిందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఎద్దేవా చేశారు. ఆమనగల్లులోని ఓ గార్డెన్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొనుగోటి అర్జున్‌రావు, పట్టణ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర నాయకుడు ఉప్పల వెంకటేశ్ విచ్చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 అలవికాని హామీలిచ్చి.. గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ 22 నెలలు గడుస్తున్నా హామీలు అమలు చేయడంలో మాత్రం విఫలం చెందిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రధానమంత్రిని కలిసి పార్లమెంట్లో రాజ్యాంగబద్దంగా బీసీలకు 42 శాతం ఆమోదం తెలిపేలా ప్రధానమంత్రిపై ఒత్తిడి తెచ్చేదన్నారు.
బీసీ డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. మహిళలకు రూ.55వేలు, వృద్ధులకు రూ.1.32 లక్షలు, దివ్యాంగులకు రూ.44వేలు, 33 లక్షల మంది ఆడబిడ్డలకు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, రూ.8000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, రైతు భరోసా కింద రైతులకు రూ.76వేలు, నిరుద్యోగులకు రూ.88 వేలు, ఆటో కార్మికులకు 24 వేలు, రైతు కూలీలకు రూ.24వేలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడిందని ఆయన తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డయితే తుక్కుగూడ నుంచి శ్రీశైలం వరకు 6 లేన్ల రోడ్డు నిర్మించాలన్నారు. బడాబాబులు, బంధువుల భూములు కాపాడేందుకు ట్రిపుల్ఆర్ ఆలైన్మెంట్ మార్చిందన్నారు. 12.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం కేసీఆర్ రూ.35 వేల కోట్లు కేటాయించి రూ.27,500 కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేసిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి ఒక్క రుపాయి కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లుల విడుదలకు నిధుల నుంచి 10 శాతం 20 శాతం తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. బాకీకార్డే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాస్త్రమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నా రానున్న శాసనసభ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కేటాయిస్తామని ఇప్పుడే తీర్మానం చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరాచక పాలన సహించలేక ప్రజలే తిరగబడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. అనంతరం జైపాల్‌యాదవ్ స్థానిక నాయకులతో కలిసి కాంగ్రెస్ హామీల బాకీ కార్డును విడుదల చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, మాజీ జడ్పీటీసీ విజితారెడ్డి, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనూనాయక్, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో అప్షన్ సభ్యుడు హాజీ పాషా, మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్‌గౌడ్, మండల సీనియర్ నాయకులున్నారు.