బషీరాబాద్, ఏప్రిల్ 24 : కాంగ్రెస్ పార్టీలోకి మధ్యలో వచ్చినవారు తనను టార్గెట్ చేస్తున్నారని.. ఓ కాంగ్రెస్ నాయకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌లో జరిగింది. కుటుంబసభ్యులు, సూసైడ్ నోట్ ఆధారంగా వివరాలిలా ఉన్నాయి.
మైల్వార్ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు గురువారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి వచ్చారు. ప్రారంభోత్సవం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బిచ్చిరెడ్డి గ్రామ సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా, మండలానికి చెందిన మరో నాయకుడు లేచి మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో బిచ్చిరెడ్డి చేసేదేమీలేక స్టేజిపై అలాగే నిల్చుండి పోయాడు. ఎమ్మెల్యే కార్యక్రమమంతా పార్టీలోకి మధ్యలో వచ్చినవారు అడ్డుపడ్డారు.
పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న తనను మధ్యలో వచ్చినవారు ఇబ్బందులు గురి చేయడంపై బిచ్చిరెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. ఎమ్మెల్యే గ్రామం నుంచి వెళ్లగానే ఇంటికి వెళ్లి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు తను ఖర్చు పెట్టిన లెక్కలు రాశాడు. తన ఆత్మహత్యాయత్నానికి కారణం నవాంద్గీ సహకార సంఘం వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్, గ్రామానికి చెందిన నాయకులు సతీశ్, రాజు, బుగ్గప్ప తదితరులంటూ పేర్లను రాసి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు తాండూరు జిల్లా అస్పతికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం వికారాబాద్ అస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి అరోగ్యం నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.