రంగారెడ్డి, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తకు టికెట్ దక్కుతుందన్న ఆశలు ఆవిరవుతున్నాయి. కాసులున్నవారికే టికెట్ ఇవ్వాలని కాన్సెప్ట్‌తో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నది. దీంతో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు పదవులు అందని ద్రాక్షలా మారాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఇబ్రహీంపట్నం, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల మున్సిపాలిటీలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ స్థానాల కోసం కాంగ్రెస్ నాయకులు కోటీశ్వరులను తెరమీదకు తీసుకొస్తున్నారు. దీంతో తాము ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్నా టికెట్ వచ్చే అవకాశాలు లేవని పలువురు ఆందోళనకు గురవుతున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీలో అనుకున్నవారికి టికెట్ వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. ఈ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఇబ్రహీంపట్నంలో పార్టీకి ఎలాంటి సంబంధంలేని ఓ పారిశ్రామికవేత్త.. అలాగే, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఓ ప్రభుత్వ అధికారిని ఏరికోరి తెరమీదకు తీసుకొచ్చి టికెట్లు ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ వార్డుల్లో పనిచేస్తూ ఎన్నో ఏళ్లుగా జెండా మోసిన తమకు అన్యాయం జరుగుతున్నదని నాయకులు వాపోతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడలో కూడా పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కనపెట్టి డబ్బులున్నవారికే టికెట్లు ఇస్తున్నారని ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి. శంకర్పల్లి మున్సిపాలిటీలో 15 వార్డులున్నాయి. ఈ మున్సిపాలిటీ హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్నది. ఈ మున్సిపాలిటీ పూర్తిగా పట్టణ ప్రాంతంగా ఉండటంతో ఇక్కడ ఎన్నికలు ఖరీదైనవిగా మారాయి.
ఈ మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ పార్టీ డబ్బులున్నవారినే తెరమీదకు తీసుకువచ్చి టికెట్లు ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. మొయినాబాద్ మున్సిపాలిటీలో 26 వార్డులున్నాయి. ఈ మున్సిపాలిటీని ఎస్సీ జనరల్ కేటగిరికి కేటాయించారు. అయినప్పటికీ వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి తీవ్ర పోటీ నెలకొన్నది. ఈ పోటీలోనూ డబ్బులున్నవారికే టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులున్నాయి. ఈ మున్సిపాలిటీ జనరల్ కేటగిరికి కేటాయించారు.
ఈ మున్సిపాలిటీలో కూడా తీవ్ర పోటీ నెలకొన్నది. మంగళవారం ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కల్వకుర్తిలో సమావేశం నిర్వహించి డబ్బు కలిగి బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని, ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు ఖర్చుచేసేవారు కావాలని సూచనప్రాయంగా సూచించినట్లు తెలిసింది. చేవెళ్ల మున్సిపాలిటీలో గెలుపొందాంటే డబ్బున్నవారికే టికెట్లు ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి సూచనప్రాయంగా తెలిపినట్లు సమాచారం.