కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి వనరుల ప్రాజెక్టులపై నిలువెత్తు నిర్లక్ష్యాన్ని చూపుతున్నది. ఎలాంటి నిధులు కేటాయించకుండా అన్నదాతలను అరిగోస పెడుతున్నది. జిల్లాలోని గ్రామీణ ప్రాం తాలకు చెందిన రైతులు పంటలు పండక నీటి ఎద్దడితో అప్పుల పాలు కావొద్దనే సదుద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం శాశ్వతంగా సాగునీరు అందించేందుకు రాచకొండ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. శివన్నగూడ రిజర్వాయర్ నుంచి 1 టీఎంసీ నీటిని ఎత్తిపోసి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని 122 చెరువులను నింపడమే కాకుండా 80 వేల ఎకరాలకు సాగునీరు అందేలా ఈ ప్రాజెక్టును రూపొందించిం ది. ఇందుకు అవసరమైన సర్వే కోసం రూ.1.72 కోట్లను కూడా కేటాయించింది. రూ.1100 కోట్లతో డీపీఆర్‌ను కూడా సిద్ధం చేసింది. అయితే, ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ అక్కడికక్కడే ఆగిపోయింది. నిధులు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగడంలేదు. కాంగ్రెస్ ప్ర భుత్వం నిధులు విడుదల చేసి ప్రాజెక్టు పనులు త్వ రగా పూర్తి అయ్యేలా చూడాలని జిల్లాలోని ప్రజలు, రైతులు కోరుతున్నారు.
రంగారెడ్డి, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : శాశ్వత నీటి ప్రాజెక్టులు లేక.. నీరందక జిల్లాలోని పలు ప్రాంతాలు ఎడారిగా మారుతున్నాయి. సరైన వర్షాలు కురియకపోవడంతో భూగర్భజలా లు అడుగంటి పంటపొలాలు ఎండిపోతున్నాయి. వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు శాశ్వతంగా సాగునీరు అందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాచకొండ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం.. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా షాద్‌నగర్ నియోజకవర్గానికి సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించింది.
అయితే, ప్రభుత్వం మారడంతో ఈ మూడు సాగునీటి ప్రాజెక్టులు అటకెక్కాయి. వీటి విషయం లో రేవంత్ సర్కార్ నిలువెత్తు నిర్లక్ష్యాన్ని చూపుతున్నది. నిధులు విడుదల చేయకుండా రైతన్నలను అరిగోస పెడుతున్నది. వర్షంపైనే ఆధారపడిన జిల్లాలోని గ్రామీణ ప్రాంత రైతుల పం టలు సాగునీరులేక ఎండిపోయి తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. సముద్ర మట్టానికి 638 అడుగుల ఎత్తులో ఉన్న ఇబ్రహీంపట్నం సెగ్మెంట్‌కు ఎలాంటి సాగునీరు వచ్చే మార్గాలు లేవు. ఈ పరిస్థితిలో రాచకొండ ఎత్తిపోతల ద్వారా శాశ్వతంగా సాగు, తాగునీరు అం దించాలని భావించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం ఆధ్వర్యంలో శివన్నగూడ రిజర్వాయర్ నుంచి 1 టీఎంసీ నీటితో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలతోపాటు మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురానికి సాగు నీరందించేందుకు రాచకొండ ఎత్తిపోతల ప్రాజెక్టును రూపొందించి.. సర్వేకోసం రూ.1.72 కోట్లను కూడా కేటాయించింది.
80 వేల ఎకరాలకు సాగు నీరు అందేలా..
రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా శివన్నగూడ రిజర్వాయర్ నుంచి 1 టీఎంసీ నీటిని ఎత్తిపోసి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని 80 వేల ఎకరాలకు సాగునీరు అందేలా గత ప్రభుత్వం ప్రాజెక్టును రూపొందించింది. శివన్నగూడ రిజర్వాయర్ నుంచి లోయపల్లి వద్ద ఉన్న రిజర్వాయర్‌ను నింపడంతోపాటు అక్కడి నుంచి మంచాల మండలంలోని ఆరుట్ల వద్ద గంగాదేవి తల్లి గుట్టపైన నిర్మించనున్న మరో రిజర్వాయర్‌ను నింపాలన్నదన్నది కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశం. గంగాదేవితల్లి రిజర్వాయర్ నుంచి మంచాల మండలంతోపాటు నారాయణపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న గొలుసుకట్టు చెరువులు నింపి భూగర్భజలాలు పెంపొందించేలా ప్రణాళికను రూపొందించారు.
అలా గే, గున్గల్, తులేకలాన్ సమీపంలో మ రో రిజర్వాయర్‌ను నిర్మించి అక్కడినుం చి ఇబ్రహీంప ట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మ హేశ్వరం నియోజకవర్గాల్లోని గొలుసుకట్టు చెరువులతోపాటు ఇబ్రహీంప ట్నం, రావిర్యాల పెద్ద చెరువులను నింపాలని భావించారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని 122 చెరువులను నింపడమే రాచకొండ ఎత్తిపోతల పథకం ప్రధాన లక్ష్యం. అలాగే, గ్రావిటీ ద్వారా కాల్వలు నిర్మించి ఇబ్రహీంపట్నం, మంచాల, యాచా రం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలోని సాగునీటి అవసరాలు తీర్చేందుకు చర్యలు చేపట్టారు.
శివన్నగూడ రిజర్వాయర్‌కు 2014లో గత సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. ఏర్పాటు చేసిన శిలాఫలకం
రూ.1100 కోట్లతో డీపీఆర్ సిద్ధం
రాచకొండ ఎత్తిపోతల పథకానికి రూ.1,100 కోట్లతో రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరమ్ డీపీఆర్‌ను సిద్ధం చేసింది. అప్పటి మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన నీటి పారుదలశాఖ అధికారులతో పలు మార్లు సమీక్షలు కూడా నిర్వహించారు. ఈ ప్రాజెక్టు నిధుల కేటాయింపు వరకు రాగానే ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
రాచకొండ ఎత్తిపోతలకు నిధులు కేటాయించాలి
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల రైతులకు శాశ్వతంగా సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన రాచకొండ ఎత్తిపోతల పథకానికి రేవంత్ సర్కార్ నిధులు కేటాయించాలి. శాశ్వత సాగునీటి వనరులు లేకపోవడంతో జిల్లా రైతులు ప్రతిఏటా అప్పులుచేసి సాగు చేసిన పంటపొలాలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారు. సముద్రమట్టానికి 638 అడుగుల ఎత్తులో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు అనువైనది ఒక్క రాచకొండ ఎత్తిపోతల పథకమే. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిధులు కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవాలి.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే