వికారాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : గత కేసీఆర్ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రతి ఏటా తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటి వాటిని సంరక్షించేది. ప్రతిఏటా జూన్ మొదటి వారంలోనే హరితహారం కార్యక్రమ ప్రారంభ తేదీలను ఖరారు చేసి జూన్ రెండో వారంలోనే మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేది. కాంగ్రెస్ సర్కార్ మాత్రం హరితహారం లాంటి కార్యక్రమాలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నది. మొక్కలు నాటే కార్యక్రమానికి ఇంకా ప్రారంభ తేదీని ఖరారు చేయకపోవడంతో నర్సరీల్లోనే మొక్కలు వృథాగా పడి ఉన్నాయి.
ఆలస్యం చేస్తుండడంతో మెయింటెనెన్స్కూ ఖర్చు చేయాల్సి వస్తున్నదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఆలస్యమైతే నర్సరీల్లోని చాలా వరకు మొక్కలు వృథా అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం పేరును కాంగ్రెస్ సర్కార్ వనమహోత్సవంగా పేరు మార్చిన విషయం తెలిసిందే. మరోవైపు మొక్కలు నాటేందుకు ఈ నెల మొదటి వారం నుంచే గుంతలు తీసే ప్రక్రియ ప్రారంభం కాగా, కొన్ని చోట్ల తీసిన గుంతలు మూసుకుపోయే పరిస్థితులున్నాయి. కాగా, మొక్కలను పెంచేందుకు ఒక్కో నర్సరీకి రూ.1.20 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో 580 నర్సరీల్లో మొక్కలను పెంచారు. వాటిలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీల్లో 566 నర్సరీల్లో 49 లక్షలు, అటవీ శాఖ ఆధ్వర్యంలోని 14 నర్సరీల్లో 17 లక్షల మొక్కలు ఉన్నాయి.
గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆనవాళ్లు లేకుండా చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తెలంగాణకు హరితహారం కార్యక్రమం పేరు మార్చడంతోపాటు మొక్కలను నాటే కార్యక్రమంపైనా నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ ఏడాది జిల్లాలో నాటాల్సిన మొక్కలకు సంబంధించి లక్ష్యాన్ని భారీగా తగ్గించింది. పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన మొక్కలు నాటే కార్యక్రమంపై శీతకన్ను చూపడంపై జిల్లాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది జిల్లాలో 40.49 లక్షల మొక్కలను నాటాలని టార్గెట్గా పెట్టుకోగా.. ఈ ఏడాది కేవలం 10 వేల మొక్కలను మాత్రమే పెంచి 40.59 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు.
జిల్లాలో ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా 2015-16లో 73,78,000., 2016-17లో 1,39,00,000., 2017-18లో 71,04,000., 2018-19లో 86,12,000., 2019-20లో 1,02,00,000., 2021-22లో 74,00,000., 2022-23లో 40.25 లక్షల మొక్కలను జిల్లాలో నాటారు.