జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తన డకన సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో హమాలీల కొరత వెంటాడుతున్నది. మరోవైపు రైతులకు సరిపడా గన్నీ బ్యాగులూ అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో ఈ యాసంగిలో 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు.. అందుకునుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. కేవలం 40 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. అందులో ఏడు డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఉండగా.. మిగతావి ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. దిగుబడి అధికంగా రావడంతో అన్నదాతలు పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు.
తీసుకొచ్చిన వడ్లను ఎప్పటికప్పుడు తూకం వేయకుండా అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం చేయడంతోపాటు.. పలు కొర్రీలతో రైతన్నల సహనానికి పరీక్ష పెడుతున్నారు. హమాలీలు, గన్నీ బ్యాగుల కొరతతో అన్నదాతలు రోజుల తరబడిగా అక్కడే నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల పరిధిలో కుప్పలుగా పోసిన ధాన్యం రాశులు అకాల వర్షాలతో తడిసి.. ముద్దవుతున్నాయి. దీంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మద్దతు ధర వస్తుందని.. పంటల సాగుకు తీసుకొచ్చిన అప్పులను చెల్లించవచ్చనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకొస్తే.. సక్రమంగా కొనుగోళ్లు చేయకపోవడంతో అకాల వర్షాలకు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– రంగారెడ్డి, మే 19 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో ఈ యాసంగిలో ధాన్యం దిగుబడి అధికంగా వస్తుందని తెలిసినా అధికారులు సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వర్షాకాలంలో కొనుగోలు చేసిన వడ్లను దృష్టిలో ఉంచుకుని.. ఈ యాసంగిలోనూ తక్కువ వడ్లే వస్తాయని.. కేవలం 40 మాత్రమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ, జిల్లా నుంచి 2,00,000లకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. దీంతో అన్నదాతలు బయటి మార్కెట్ కంటే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిస్తే ఎక్కువ ధర వస్తుందని.. ఇక్కడికి తీసుకొస్తున్నారని పేర్కొంటున్నారు.
కేంద్రాలకు అంచనాలకు మించి ధాన్యం వస్తుండడంతో కొన్ని చోట్ల అధికారులు చేతులెత్తేసారు. జిల్లాలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏడు కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 90,000 మంది రైతుల నుంచి కేవలం 3000 క్వింటాళ్ల వరకే కొన్నారు. అలాగే, ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనూ కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా సేకరించలేదు. దీంతో అధికారులు అంచనా వేసిన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం కనిపించడంలేదు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అంతేకాకుండా ధాన్యంలో తేమ శాతం ఉన్నదని.. తాలు ఉందని ఇలా పలు రకాల కారణాలు చెబుతూ అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని సంచుల్లో నింపేందుకు సరిపడా గన్నీ బ్యాగులు ఉండడంలేదు. ఇరుగుపొరుగు వారిని అడిగి సంచులను సమకూర్చుకుని ధాన్యాన్ని సంచుల్లో నింపి వాహనాల్లో కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడ హమాలీల కొరతతో వాటిని కేంద్రాల్లోకి రానివ్వడంలేదు.
హమాలీలు దొరికిన తర్వాతే వడ్లను తూకం వేస్తున్నారు. లేకుంటే రోజుల తరబడిగా అక్కడ నిరీక్షించాల్సిందే. దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అకాల వర్షాలకు పంట తడిసిపోతే.. మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశంతో.. తక్కువ ధరకే వ్యాపారులు, దళారులకు విక్రయించి అన్నదాత నష్టపోతున్నాడు. ఇలా పలు రకాల కారణాలతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అన్నదాత సహనానికి పరీక్ష పెడుతున్నారు.