కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే సబ్బండ వర్గాలకు అన్యాయం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆసరా, కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్స్ తదితర పథకాలను అమలు చేసి ఆపద్బాంధవుడిలా కేసీఆర్ పేరొందితే.. అధికారం చేపట్టిన ఏడాదికే అన్ని వర్గాల ప్రజలను కష్టాలపాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. మొదట రైతులను నమ్మించి మోసం చేసిన రేవంత్ ప్రభుత్వం తర్వాత ఒక్కో వర్గానికి తమ అసలు నైజం తెలిసేలా వ్యవహరిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో రాజులా బతికిన రైతులు నేడు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. పంట సాగు మొదలు పెట్టినప్పటి నుంచి పండించిన పంటను కొనేదాకా రైతులకు ఏ కష్టమూ రాకుండా కంటికి రెప్పలా కేసీఆర్ కాపాడుకుంటే… ఏడాదిలోనే రేవంత్‌రెడ్డి రైతులను అప్పులపాలు చేసి నట్టేట ముంచిందని జిల్లా రైతాంగం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రూ.2 లక్షలలోపు రుణమాఫీ అయ్యిందంటూ ప్రచారం చేసుకుంటున్న లేనిపోని కొర్రీలు పెట్టి సగం మందికి అన్యాయం చేసిన రేవంత్ సర్కార్.. అర్హులుగా గుర్తించిన వారికి కూడా రుణమాఫీ చేయకపోవడం గమనార్హం.
– వికారాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన షరతులతో జిల్లా రైతాంగానికి అన్యాయం జరిగింది. పంట రుణమాఫీకి పెట్టిన షరతులతో కేవలం కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.లక్షలోపు పంట రుణాల మాఫీతో 1.26 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరితే, కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన షరతులతో చాలా మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. పట్టాదారు పాసుపుస్తకాలను పరిగణనలోకి తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతోనే సుమారు లక్ష మంది రైతులు నష్టపోయారు. జిల్లావ్యాప్తంగా 2.50 లక్షల మంది రైతులుండగా.. సుమారు 2 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే వీరిలో కేవలం 1.01 లక్షల మంది రైతులను మాత్రమే రూ.2 లక్షలలోపు రుణమాఫీకి అర్హులుగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఒకేసారి రూ.2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని హామీనిచ్చి విడతల వారీగా రుణాలను మాఫీ చేపట్టింది. రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది కానీ వాస్తవానికి ఇంకా రూ.2 లక్షలలోపు రుణమాఫీ పూర్తికాలేదు. నాలుగో విడత రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను జిల్లా వ్యవసాయాధికారులు విడుదల చేసినప్పటికీ సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో మాత్రం ఇంకా డబ్బులు జమకాలేదు. జాబితాలో పేరు వచ్చిన రైతులు ఎప్పుడు తమ రుణాలు మాఫీ అవుతాయంటూ వ్యవసాయాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.1.50 లక్షల రుణాలలోపు ఉన్న రూ.750 కోట్ల రుణాలను మాఫీ చేయగా.. నాలుగో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలలోపు రుణాలున్న మరో 10,660 మంది రైతులకు సంబంధించిన రూ.98.17 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉన్నది.
సబ్బండ వర్గాల ప్రజలకు ఎన్నికలకు ముందు హామీలనిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రైతులను నట్టేట ముంచింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు ప్రతి సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందించి అప్పుల్లో కూరుకుపోయిన రైతులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. అధికారంలోకి వస్తే రైతులకు రూ.16వేల పెట్టుబడి సాయం అందిస్తామని అబద్ధపు హామీనిచ్చి రూ.12 వేలకు తగ్గిస్తూ ఏడాదికి నిర్ణయం తీసుకున్న రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఒకేసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో టింగ్ టింగ్‌మంటూ రైతు భరోసా సాయాన్ని జమ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది. విడతల వారీగా రైతు భరోసా సాయాన్ని జమ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.. మొదట మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, అందులోనూ తక్కువ జనాభా ఉన్న ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రైతు భరోసా సాయాన్ని అందజేసింది.
తదనంతరం ఒక్క ఎకరం, రెండెకరాలు, తదనంతరం ఇప్పటివరకు మూడెకరాల వరకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. జిల్లావ్యాప్తంగా అర్హులుగా గుర్తించిన రైతుల్లో కేవలం సగం మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందింది. మిగతా రైతులు రైతు భరోసా సాయం కోసం వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తై వానకాలం సీజన్ కూడా పూర్తైనా ఇంకా రైతు భరోసా సాయం అందకపోవడంతో విత్తనాలు, ఎరువుల కోసం అప్పులు చేసిన జిల్లా రైతాంగం పెట్టుబడి సాయం ఎప్పుడొస్తుందోనని ఎదురుచూస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 3,12,872 మంది రైతులు అర్హులుగా గుర్తించి వీరికి రూ.385.46 కోట్ల రైతు భరోసా సాయాన్ని అందజేసేందుకు నిర్ణయించగా.. ఇప్పటివరకు మూడెకరాలలోపుగల 1,74,495 మంది రైతులకు రూ.143.13 కోట్ల రైతు భరోసా సాయాన్ని మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మిగతా రైతులకు రైతు భరోసా సాయం ఎప్పుడు జమ అవుతుందనేది అధికారులకు కూడా స్పష్టత లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుంట భూమి మొదలుకొని అర్హులైన వారందరికీ ఎకరాకు ప్రతి సీజన్‌కు ముందే రూ.10 వేల చొప్పున రైతు బంధు సాయాన్ని అందజేసింది. జిల్లావ్యాప్తంగా 12.35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూములున్నాయి. వీటిలో అర్హులైన వారిని గుర్తించి ప్రతి సీజన్‌కు 6 లక్షల ఎకరాలకుపైగా వ్యవసాయ భూములకు రూ.300 కోట్లపైగా రైతు బంధు సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద రూ.2926 కోట్ల సాయాన్ని రైతులకు పెట్టుబడి నిమిత్తం అందజేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిపోయినా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. కొంత మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. చాలా వరకు లక్ష వరకు రుణమున్న రైతులకు కూడా ఇంతవరకు రాలేదు. బ్యాంకులో వెళ్లి అడిగితే మాకు తెల్వదంటున్నారు. అధికారులను అడిగితే మేం పంపించామని.. ప్రభుత్వం నుంచి రావాలని అంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రూ.2లక్షల వరకు రైతుల ఖాతాల్లో రుణమాఫీ జమ చేయాలి.
– రాములు, రైతు, ఆలేడ్, దుద్యాల మండలం, కొడంగల్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలి. బొంరాస్‌పేట్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలో నాకు 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణం ఉన్నది. కానీ నాకు ఇప్పటివరకు ఎలాంటి రుణమాఫీ డబ్బులు రాలేదు. బ్యాంకులో తీసుకున్న రుణం మాఫీ కాకపోవడంతో మళ్లీ నాకు రుణం ఇవ్వడంలేదు. దీంతో పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది.
– మల్లయ్య, రైతు, తుంకిమెట్ల
కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన మాట ప్రకారం అర్హత కలిగిన ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలి. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా రైతులకు పూర్తి స్థాయిలో పంట రుణాలను అందజేయలేదు. అందరికీ రుణ మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా నాకు మాత్రం రుణమాఫీ అందలేదు. దీంతో వ్యవసాయ పెట్టుబడులకు ఇబ్బందులు వస్తున్నాయి.
– రవిగౌడ్, రైతు, మెట్లకుంట
వికారాబాద్‌లోని కెనరా బ్యాంక్‌లో రూ.50వేలు రుణం తీసుకున్నా. ఇప్పటివరకు బ్యాంక్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. బ్యాంక్‌కు, వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లి అడగగా, వస్తాయంటూ మాట దాటవేస్తున్నారు. మా ఊరి రైతుల ఖాతాలు ఈ బ్యాంకులో చాలా ఉన్నాయి. కొద్దిమంది రైతులకు మాత్రమే రుణ మాఫీ జరిగింది. బ్యాంకు అధికారుల నిరక్ష్యమో, ప్రభుత్వ వైఫల్యమో అర్థం కావడంలేదు.
– వెంకటయ్య, కొంపల్లి, వికారాబాద్
నాకు 24 గుంటల భూమి ఉన్నది. వికారాబాద్ కెనరా బ్యాంక్‌లో రూ.34 వేల రుణం తీసుకున్నాను. వెంటవెంటనే రెన్యువల్ కూడా చేశాను. బ్యాంకు, వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్తే తరువాత వస్తుందని చెబుతున్నారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రుణ మాఫీ కాలేదు.
– సంద నర్సింహులు, కొంపల్లి, వికారాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ సక్రమంగా అమలు చేయడంలేదు. మర్పల్లి కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.2.03 లక్షల రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పటివరకు చెయ్యలేదు. సర్కారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. చేతగాని హామీలిచ్చి మభ్యపెట్టారు.
– నీలి శంకరయ్య, మర్పల్లి
భరోసా లేని రైతు భరోసా పేరు చెప్పి రైతు బంధు బందు చేసేలా ఉన్నాడు. రేవంత్ సర్కార్‌కు చేతకాక రైతులను నిండా ముంచుతున్నది. ఎద్దు ఏడ్చిన ఎవుసము, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదు.
– జుట్టు వెంకటయ్య, నాగులపల్లి, పెద్దేముల్ మండలం