వికారాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్భాటం తప్పా అభివృద్ధి గుండు సున్నా. 23 నెలల రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకంలోనూ ఏదో ఒక కొర్రీ పెడుతూ అర్హులకు అన్యాయం చేస్తున్నది. వికారాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయమంటూ ఉదరగొట్టి ఏడాది కిందట వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వుడా)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు అభివృద్ధికి సంబంధించి ఊసే ఎత్తకపోవడం గమనార్హం. వుడాను ఏర్పాటు చేశామని సోషల్ మీడియాలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రచారం చేసుకోవడం తప్ప ఏడాదిగా ఒక్క అభివృద్ధి పనినీ చేపట్టకపోవడం శోచనీయం.
వుడాను ఏర్పాటు చేసి ఏడాది పూర్తైనా ఇప్పటివరకూ జిల్లా సమగ్రాభివృద్ధికి ఎలాంటి సమావేశాలు నిర్వహించకపోవడంతోపాటు ఎలాం టి మాస్టర్ ప్లాన్‌నూ సిద్ధం చేయలేదు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ మున్సిపాలిటీలతోపాటు 493 గ్రామాలను కలుపుతూ వుడాను ఏర్పాటు చేసినా.. దాని పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా నాలుగు మున్సిపాలిటీల్లోని బైపాస్ రోడ్లనూ అభివృద్ధి చేయాలని వుడా ఉత్తర్వుల్లో ఉన్నా ఆ దిశగా అడుగు ముందుకు పడకపోవడంతో జిల్లావాసులు మండిపడుతున్నారు.
సీఎం జిల్లా అంటూ పేరుకు చెప్పుకోవడమే తప్పా అభివృద్ధి జరగడం లేదం టూ అసహనం వ్యక్తం చేస్తున్నా రు. వుడా ఏర్పాటై ఏడాది దాటి నా అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా వుడాకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి జిల్లా సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రిని ప్రజలు కోరుతున్నారు.
ఏడాది కిందట ప్రభుత్వం వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వుడా)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలతోపాటు 493 గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసింది. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలతోపాటు కొడంగల్ మండలంలోని 17 గ్రామాలు, వికారాబాద్ మండలంలోని 24 గ్రామాలు, తాండూరు మండలంలోని 39, పరిగి మండలంలోని 35, బొంరాస్‌పేట మండలంలోని 16, దుద్యాల మండలంలోని 12, కులకచర్ల మండలంలోని 15, బషీరాబాద్ మండలంలోని 30, మోమిన్‌పేట మండలంలోని 22, నవాబుపేట మండలంలోని 21, ధారూరు మండలంలోని 32, దౌల్తాబాద్ మండలంలోని 24, యాలాల మండలంలోని 32, బంట్వారం మండలంలోని 13, కోట్‌పల్లి మండలంలోని 17, పూడూరు మండలంలోని 33, మర్పల్లి మండలంలోని 27, దోమ మండలంలోని 27, పెద్దేముల్ మండలంలో ని 28, చౌడాపూర్ మండలంలోని 13 గ్రామాలను వుడా పరిధిలోకి తీసుకొచ్చింది. వుడా చైర్మన్‌గా కలెక్టర్, వైస్ చైర్మన్‌గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, సభ్యులుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శి లేదా వారు నామినేట్ చేసిన వారితోపాటు సీడీఎంఏను, డీటీసీపీని సభ్యులుగా నియమించింది.