కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సబ్బండ వర్గాలకు అన్యాయం చేసింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చిన కాంగ్రెస్ పార్టీపై ఆశతో ఎదురుచూసిన అన్ని వర్గాల ప్రజలకు నిరాశను మిగిల్చింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధానంగా జిల్లాకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అరకొర నిధులే కేటాయించారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపుల నిమిత్తం మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు చేశారే తప్ప కొత్తగా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి నయాపైసా నిధులివ్వకపోవడం గమనార్హం. మొదటి నుంచి పాలమూరు ప్రాజెక్టుపై పగబట్టిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై కక్షపూరిత విధానాన్నే కొనసాగిస్తున్నది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని సుమారు 5 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు పూర్తి చేసి కాల్వలు తవ్వేందుకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులివ్వగా.. రూ.వేల కోట్లు ఖర్చు చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఏడాదిలో సాగునీరొస్తది.. మా ప్రాంతం పచ్చబడుతది.. బతుకులు బాగుపడుతాయనుకున్న వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయి.
ఏడాదిలో సాగునీరొస్తుందని ఆశతో ఎదురుచూసిన జిల్లా రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో పంటలు ఎండుముఖం పట్టి నిరాశే మిగిలింది. మరోవైపు కోట్‌పల్లి ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన వెంటనే ఆధునీకరిస్తామని హామీనిచ్చిన తాండూరు, వికారాబాద్ ఎమ్మెల్యేలు హామీని మరిచిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతుల కోసం ఇప్పటివరకు పదిసార్లు అంచనాలు వేశారే తప్ప నయా పైసా నిధులను కూడా విదల్చలేదు. బడ్జెట్లోనూ కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడం గమనార్హం.
– వికారాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ)
అనంతగిరి హిల్స్ అందాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ పెరిగినప్పటికీ పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నది. బడ్జెట్లో అనంతగిరి పర్యాటకాభివృద్ధి ఊసే లేకపోవడం గమనార్హం. నిత్యం అనంతగిరి ప్రకృతి అందాలను వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులు కనీస వసతులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి హిల్స్‌పై కాంగ్రెస్ సర్కారు సవతి తల్లి ప్రేమను చూపిస్తుండడంపై జిల్లా ప్రజానీకం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలోనే కొంతమేర నిధులు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా అనంతగిరి హిల్స్ పర్యాటక అభివృద్ధికి కేటాయించలేదు. అనంతగిరి హిల్స్ పర్యాటక అభివృద్ధిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై జిల్లా మేధావులు, విద్యావంతులు ప్రభుత్వ విధానంపై పెదవి విరుస్తున్నారు.
ఎన్నికలకు ముందు అనంతగిరి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీలిచ్చిన జిల్లా ఎమ్మెల్యేలు ఇప్పుడు మాట్లాడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడంతోపాటు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ సొంత నియోజకవర్గంలోనే అనంతగిరి హిల్స్ ఉన్నప్పటికీ ఆయన కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో మొబిలిలీ వ్యాలీని ఏర్పాటు చేస్తే జిల్లాకు మణిహారంగా మారనున్నదని జిల్లా ప్రజానీకం కలలు గన్నారు. కానీ వ్యాలీకి సంబంధించి ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. గత ఏడాదిగా నిలిచిపోయిన మొబిలిటీ వ్యాలీ అభివృద్ధి పనులు బడ్జెట్ అనంతరం దూసుకుపోతుందని అనుకున్న జిల్లా ప్రజల ఆశలపై రేవంత్ సర్కారు నీళ్లు చల్లింది.
అన్ని వర్గాలను నిరాశపర్చిన బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, కులవృత్తిదారులకు తీవ్ర అన్యాయం చేసింది. ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చి అర్హులైన సుమారు లక్ష మందికి రుణమాఫీ చేయకుండా నష్టం చేకూర్చింది. జిల్లాలో రూ.2 లక్షలపైన రుణాలున్న సుమారు 2 వేల మంది రైతులు కటాఫ్‌కు పైన ఉన్న రుణ మొత్తాన్ని చెల్లించారు. దీనిపై బడ్జెట్లో ఎలాంటి స్పష్టతనివ్వలేదు. రైతు భరోసా కేవలం 3 ఎకరాల వరకు అందజేసి నిలిపివేసింది. తర్వాత ఇస్తారా లేదా అనేది తెలుపలేదు. దళిత బంధు పథకాన్ని గాలికి వదిలేయడంతోపాటు, గొల్ల, కుర్మలను విస్మరించి వారి జీవితాలను అగాథంలోకి నెట్టేసింది. మహిళలకు ప్రతినెలా రూ.2 వేల సహాయం అందిస్తామని హామీనిచ్చి అందుకు సంబంధించి ప్రస్తావనే లేదు, పింఛన్ల పెంపునకు సంబంధించి కూడాఊసెత్తకపోవడం గమనార్హం.
ఇది మాటల ప్రభుత్వమే..
ప్రజలకు మాయ మాటలు చెప్పడం, మోసం చేయడంలో మాటలు నేర్చింది కాంగ్రెస్ పార్టీ. చేతల ప్రభుత్వం కాదని మరోసారి రుజువైంది. అనంతగిరి టూరిజం అభివృద్ధికి బడ్జెట్ కేటాయించడంలో, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. టూరిజం అభివృద్ధి అయితే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు వచ్చేవి. అయితే ఈ పనులు చేయకూడదని సర్కారు కంకణం కట్టుకున్నట్లున్నది. కోట్‌పల్లి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తే కాలువ ద్వారా వేల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉంటుండే. నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు అరిగోసపడుతున్నారు.
– గోపాల్, రామయ్యగూడ, వికారాబాద్
మాటలు కిలోమీటర్.. పనులు మిల్లీమీటర్..!
మాటలు కిలోమీటర్ వెళతాయి. పనులు మిల్లీమీటర్ కూడా దాటదనే సామెతలా కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరు తయారైంది. అనంతగిరిని ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పారు. కాని అనంతగిరి అభివృద్ధికి అవగింజంతైనా నిధులు కేటాయించకపోవడం కాంగ్రెస్ పార్టీ చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనం. టూరిజంగా అభివృద్ధి చెందితే జిల్లా ప్రజలకు ఉపాధి లభిస్తుందని ఎంతో ఆశతో ఉన్నవారికి కాంగ్రెస్ మొండి చేయి చూపించింది. గ్రామపంచాయతీలకు కూడా నిధులు కేటాయించలేదు. బడ్జెట్లో ఏ ఒక్క పనినీ సంపూర్తిగా చేయడం చేతకాదని చెప్పేందుకు నిదర్శనంగా మారింది. ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాని కాంగ్రెస్ సర్కారును ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
– మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే
పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలి
జిల్లాలో వ్యవసాయ, ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాల్సి ఉండేది. కాని టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం బాధాకరం. అనంతగిరికి, కోట్‌పల్లి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధిపర్చాలి. కాలయాపన చేయకుండా త్వరగా అభివృద్ధి చేస్తే జిల్లా ప్రజల కోరిక నెరవేరుతుంది. అనంతగిరిని పర్యాటక కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి, అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఉన్నది.
– శ్రీనివాస్, వీడీడీఎఫ్ జిల్లా చైర్మన్
పాలమూరు-రంగారెడ్డిపై చిన్నచూపు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్నచూపు తగదు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పనులు సగానికిపైగా పూర్తి చేయడం జరిగింది. కాలువలు తవ్వడం పూర్తయితే చాలా వరకు పంట పొలాలకు సాగునీరు రావడంతోపాటు బోరుబావుల్లో కూడా భూగర్భ జలాలు పెరిగి పంటలు ఎండకుండా ఉండేవి. ప్రాజెక్టు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం చేయకుండా నిధులు కేటాయించి వెంటనే పూర్తిచేయాలి.
– రాఘవేందర్‌రెడ్డి, తుంకిమెట్ల
పంట పొలాలకు సాగునీరందించాలి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కొడంగల్ నియోజకవర్గం బొంరాస్‌పేట్ మండలానికి తీసుకువచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను కేటాయించి పనులను ప్రారంభించింది. కానీ కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టుకు అవసరమైన నిధులను మాత్రం బడ్జెట్లో కేటాయించలేదు. నిధుల కేటాయింపు లేనప్పుడు ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది. వెంటనే ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కేటాయించి ప్రాజెక్టును పూర్తిచేసి, పంట పొలాలకు సాగునీరు అందించి, ఈ ప్రాంతంలో పంటలు ఎండకుండా చూడాలి.
– మహేందర్‌రెడ్డి, ఏర్పుమళ్ళ