బడంగ్‌పేట, డిసెంబర్ 3 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని ప్రజలకిచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ప్రశ్నించారు. జల్పల్లి మున్సిపాలిటీలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఇచ్చిన వారందరికీ తులం బంగారం ఇచ్చే వరకు కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన రిజర్వాయర్లను నేడు రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని.. కొత్తగా జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు.
ప్రజల దాహార్తిని తీర్చింది.. బీఆర్ఎస్ అధినేత కేసీఆరే..
భవిష్యత్‌లో నీటి సమస్య రాకుండా ఉండడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సమస్య లేకుండా చేశారని ఎమ్మెల్యే సబితారెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ శివారు పరిధిలో ఉన్న మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఉన్న నీటి సమస్యను పరిష్కరించడానికి రూ.1200 కోట్లు, మహేశ్వరం నియోజకవర్గానికి రూ.260 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.
మెరుగైన వైద్యం కోసమే బస్తీ దవాఖానల ఏర్పాటు..
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి బస్తీ దవాఖానలను కేసీఆర్ ఏర్పాటు చేయించారన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోనే 13 బస్తీ దవాఖానలు, 9 అర్బన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బస్తీ దవాఖానల్లో డాక్టర్లు లేరని, మందుల కొరత ఉందని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.