రంగారెడ్డి, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెబెల్స్‌తో బెడద తీవ్రంగా ఉన్నది. టికెట్ల కేటాయింపులో తమకు న్యాయం జరగలేదని పలువురు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ఇన్చార్జిలకు రెబెల్స్‌తో తలనొప్పిగా మారింది. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాద్‌నగర్ వంటి ప్రాం తాల్లో వారు అధికంగా నామినేషన్లు వేశారు.
వారిని బుజ్జగించే యత్నం చేస్తున్నా ససేమిరా అంటున్నారు. మరోవైపు దిగి రాకపోతే సస్పెన్షన్ వేటు వేస్తామని పార్టీ అధిష్ఠానం హెచ్చ రించినా నామినేషన్లకే సిద్ధపడ్డారు. దీంతో బీఫారాలు ఎవరికి ఇవ్వాలో తెలియక అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతున్నది. ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులుండగా 60 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో కాంగ్రెస్ అభ్యర్థులే 30 మంది, చేవెళ్ల మున్సిపాలిటీలో 18 వార్డులుండగా 71 నామినేషన్లు రాగా.. అందులో 53 మంది.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులకు 115 మంది నామినేషన్లు దాఖలు కాగా, అందులో 73 మంది..
మొయినాబాద్ మున్సిపాలిటీలో 26 వార్డులకు 101 నామినేషన్లు రాగా.. అందులో హస్తం పార్టీకి చెందిన వారు 67 మంది ఉన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులుండగా 108 నామినేషన్లు రాగా, అందులో 84 మంది.. శంకర్పల్లి మున్సిపాలిటీలో 15 వార్డులుండగా 52 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో కాంగ్రెస్‌కు చెందిన వారు 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఒక్కో వార్డు నుంచి కాంగ్రెస్‌లో రెండు నుంచి మూడు వరకు రెబెల్స్ నామినేషన్లు దాఖలు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో డబ్బున్న వారికే టికెట్లు ఇచ్చేందుకు అధిష్ఠానం మొగ్గు చూపడంతో పార్టీలో పనిచేసే కార్యకర్తలకు సీట్లు దక్కడంలేదని వాపోతున్నారు.