ఒక దొంగ ఓ రాత్రి మాలిక్ బిన్ దీనార్ ఇంటి గోడ ఎక్కి, చాలా సులభంగా లోపలికి దూరాడు. తీరా లోపలికి వచ్చాక దొంగిలించడానికి విలువైనది ఏదీ కనిపించకపోయేసరికి అతనికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఆ సమయంలో మాలిక్ దేవుడి ప్రార్థన (నమాజ్)లో మునిగిపోయి ఉన్నారు. ఇంట్లో ఎవరో ఉన్నారని గ్రహించిన మాలిక్, త్వరగా తన ప్రార్థన ముగించి దొంగ వైపు తిరిగారు. ఏమాత్రం కంగారు పడకుండా, భయపడకుండా మాలిక్ ప్రశాంతంగా చిరునవ్వుతో సలాం (శాంతి వచనాలు) చెబుతూ ‘నా సోదరా! అల్లాహ్ నిన్ను క్షమించుగాక. నువ్వు నా ఇంట్లోకి వచ్చావు. కానీ, నీకు పట్టుకెళ్లడానికి ఏదీ దొరకలేదు. అలాగని నిన్ను ఇక్కడి నుండి ఖాళీ చేతులతో పంపించడం నాకు ఇష్టం లేదు’ అన్నారు. ఆయన పక్క గదిలోకి వెళ్లి చెంబుతో నీళ్లు పట్టుకొచ్చారు. ఆ దొంగ కళ్లలోకి ఆర్ద్రంగా చూస్తూ, ‘నువ్వు ఒజూ (కాళ్లు చేతులు శుభ్రం) చేసుకుని రెండు రకాతుల ప్రార్థన చెయ్యి. నువ్వు అలా చేస్తే, నువ్వు ఆశించి వచ్చిన ధనం కంటే అతి గొప్ప నిధితో ఈ ఇంటి నుంచి తిరిగెళ్తావు’ అని అన్నారు. మాలిక్ మంచితనానికి, ఆత్మీయమైన మాటలకు ఆ దొంగ మనసు కరిగిపోయింది. ‘సరేనండీ, ఇది నిజంగా నేను కాదనలేని గొప్ప అవకాశం’ అన్నాడు. కాళ్లు చేతులు కడుక్కుని, రెండు రకాతుల ప్రార్థన పూర్తి చేశాక ఆ దొంగ ముగ్ధుడై, ‘ఓ మాలిక్! నేను మరికాసేపు ఇక్కడే ఉండి, ఇంకో రెండు రకాతుల ప్రార్థన చేసుకోవచ్చా?’ అని అడిగాడు.
దానికి మాలిక్, ‘అల్లాహ్ నీచేత ఎంత ప్రార్థన చేయించాలనుకుంటున్నాడో అంతసేపు నువ్వు ఉండి ప్రార్థించుకో’ అన్నారు. ఆ దొంగ ఆ రాత్రంతా మాలిక్ ఇంట్లోనే ఉండిపోయాడు. తెల్లవారే వరకు ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు. ఉదయాన్నే మాలిక్ అతనితో, ‘ఇక నువ్వు వెళ్లి, మంచిగా జీవించు’ అన్నారు. కానీ, ఆ దొంగ అక్కడి నుంచి వెళ్లకుండా, ‘నేను ఈ రోజు ఉపవాసం (రోజా) ఉండాలని అనుకుంటున్నాను. ఈ రోజు కూడా మీతోనే ఇక్కడే ఉండవచ్చా?’ అని అడిగాడు. ‘నువ్వు ఎంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం ఉండొచ్చు’ అన్నారు మాలిక్.
ఆ దొంగ కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోయాడు. ప్రతి రాత్రి ఆలస్యంగా లేచి దేవుణ్ని ప్రార్థించడం, పగటిపూట ఉపవాసాలు ఉండటం అలవాటు చేసుకున్నాడు. చివరికి ఆయన వెళ్లే సమయం వచ్చినప్పుడు మాలిక్‌తో ‘ఓ మాలిక్! నేను చేసిన పాపాలన్నింటినీ వదిలేసి, నా పాత జీవితాన్ని మార్చుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాను’ అన్నాడు. దానికి మాలిక్, ‘అదంతా అల్లాహ్ దయ’ అన్నారు. ఆ వ్యక్తి నిజంగానే తన దారి మార్చుకుని, దేవుడికి విధేయుడిగా, నీతిమంతుడిగా బతకడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత, అతనికి పాత దొంగల ముఠాలోని ఒక దొంగ ఎదురై, ‘ఏరా! నువ్వు వెతికిన నిధి నీకు దొరికిందా?’ అని వెటకారంగా అడిగాడు.
దానికి అతను ‘నా సోదరా! నాకు దొరికిన నిజమైన నిధి ‘మాలిక్ బిన్ దీనార్’. నేను ఆయన ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్లాను. కానీ, ఆయనే నా హృదయాన్ని దోచుకున్నాడు. నేను మనస్ఫూర్తిగా అల్లాహ్ ముందు పశ్చాత్తాపపడ్డాను. ఆయన ప్రేమను పొందిన మంచి దాసులు ఏ స్థానాన్నయితే పొందారో, నేను కూడా ఆ స్థానాన్ని పొందే వరకు ఆ దేవుడి దయ కోసం వేచి ఉంటాను’ అని ఆ దొంగ హృదయపూర్వకంగా బదులిచ్చాడు.