రంగారెడ్డిజిల్లాలోని ప్రధాన రహదారుల విస్తరణ పనుల విషయంలో ప్రభుత్వం నాన్చుడి ధోరణి అవలంభిస్తున్నది. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ జరుగకపోవటం వలన తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినప్పటికి నిధులు మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న రంగారెడ్డిజిల్లాలోని ప్రధాన రహదారుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. హైదరాబాద్ నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెల్లే ప్రధాన రహదారులపై వాహనాల సంఖ్యపెరిగినప్పటికీ దానికనుగుణంగా విస్తరణ చేపట్టకపోవటం వలన తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పెరుగుతున్న వాహనాల సంఖ్యకనుగుణంగా రోడ్ల విస్తరణ జరుగకపోవటంతో జిల్లావ్యాప్తంగా ప్రధాన రహదారులు రక్తసిక్తమవుతున్నాయి.
– రంగారెడ్డి, నవంబర్ 13 (నమస్తేతెలంగాణ) :
రంగారెడ్డిజిల్లాలో హైదరాబాద్ – నాగార్జునసాగర్, శ్రీశైలం – హైదరాబాద్, విజయవాడ – హైదరాబాద్, బీజాపూర్ – హైదరాబాద్ రహదారులున్నాయి. ఈ రహదారులు సింగిల్రోడ్లకే పరిమితమయ్యాయి. కాగా, హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిలో ఖానాపూర్ గేటు వరకు ఇంజినీరింగ్ కళాశాలలు అధికంగా ఉండటం వలన కళాశాలలకు చెందిన వేలాది వాహనాలు ప్రతినిత్యం సాగర్హ్రదారిపై రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారి విస్తరణ కూడా కాగితాలకే పరిమితమైంది. రోడ్డు విస్తరణ కోసం గతంలో రూ.300కోట్ల ప్రతిపాదనలు అధికారులు ప్రభుత్వానికి పంపారు. అయినా నిధులు మంజూరు చేయలేదు. అలాగే, హైదరాబాద్ – శ్రీశైలం రహదారిలో కూడా వాహనాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నప్పటికీ రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవటం వలన ప్రతిరోజు ఎక్కడో ఒక్కచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేసినప్పటికి నిధులు లేకపోవటంతో ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.
హైదరాబాద్ – బీజాపూర్ ప్రధాన రహదారి ప్రతిరోజు ప్రమాదాలతో రక్తమోడుతోంది. ఇటీవల చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19మంది మృత్యువాతకు గురయ్యారు. ఈ రోడ్డు విస్తరణ పట్టించుకోకపోవటంతో ఈ రహదారి విస్తరణ పరిస్థితి అయోమయంగా మారింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వాహనాల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు ప్రతిరోజు హైదరాబాద్కు వచ్చిపోయే ప్రయాణికులతో ఈ రోడ్డు బిజీబిజీగా మారింది. ఈ రోడ్డు హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు సింగిల్రోడ్డుగానే ఉంది. దీంతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా రోడ్డు విస్తరణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
రంగారెడ్డి జిల్లా నుంచి ప్రధానంగా నాగార్జునసాగర్హైవే, శ్రీశైలం హైవే, బీజాపూర్ హైవేలు ఉన్నాయి. ఈ రహదారుల విస్తరణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. కానీ, తదనంతరం ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు ఈ రోడ్ల విస్తరణను గాలికొదిలేసింది. ముఖ్యంగా ఇటీవల చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19మంది మృతిచెందినప్పటికి ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు మాట్లాడకపోవటం సిగ్గుచేటు. ప్రమాదాలను నివారించేందుకు వెంటనే ప్రభుత్వం రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు