రంగారెడ్డి, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : ఆదిబట్ల మున్సిపాలిటీలో రసవత్తర రాజకీయం నడుస్తున్నది. ఆదిబట్ల మున్సిపల్ చైర్ పర్సన్‌పై సొంత పార్టీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు తిరుగుబాటును ప్రకటించారు. ఇందుకు బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన కౌన్సిలర్లు కూడా మద్దతు పలికి క్యాంపునకు వెళ్లారు. అవిశ్వాసంపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం ఆ పార్టీ కౌన్సిలర్లకు విప్‌ను జారీ చేయడంతోపాటు చైర్మన్ పదవిని ఆశి స్తున్న మర్రి నిరంజన్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయినప్పటికీ మర్రి వెనక్కి తగ్గకపో వడం..ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
ఆదిబట్ల మున్సిపాలిటీలో మొత్తం 15 మంది కౌన్సిలర్లు ఉండగా.. కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు, బీఆర్ఎస్కు చెందిన ఆరుగురు, బీజేపీకి ఒక్క కౌన్సిలర్ మొత్తం 13 మంది కలిసి కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. ఈ మేరకు అవిశ్వాసంపై శుక్రవారం సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రిసైడింగ్ అధికారిగా ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి వ్యవహరిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రకటించిన నాటి నుంచే చైర్మన్ పదవిని ఆశిస్తున్న మర్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో మిగిలిన కౌన్సిలర్లంతా రహస్య క్యాంపులోనే ఉన్నారు. శుక్రవారం జరిగే బల పరీక్ష సమయానికి అందరూ క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరానికి చేరుకోనున్నారు.
ఆదిబట్ల మున్సిపాలిటీలో మర్రి నిరంజన్‌రెడ్డి 9వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు. గతంలో చైర్మన్ పదవికోసం పోటీపడగా.. అనూహ్యంగా కొత్త ఆర్తికను వరించడంతో మర్రికి పదవి చేజారింది. ఈ క్రమంలోనే గతేడాది కాలంగా కొంతమంది కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని అవ కాశంగా తీసుకుని మర్రి చక్రం తిప్పి సొంత పార్టీ చైర్పర్సన్పైనే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టించారు. ఈ తీర్మానంపై స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ పెద్దలు ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు విప్‌ను జారీ చేయడంతోపాటు మర్రి నిరంజన్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినప్పటికీ నిరంజన్‌రెడ్డి ఏమాత్రం తగ్గినట్లుగా కనబడడం లేదు. ఎవరికీ టచ్‌లోకి రాకుండా అవిశ్వాసం ప్రకటించిన కౌన్సిలర్లతో రహస్య క్యాంపులోనే ఉన్నారు.
చైర్మన్ పదవిని ఆశిస్తున్న మర్రి నిరంజన్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా..? అన్నది సందేహంగా మారింది. ఒకవేళ విప్‌ను ఉల్లంఘించి సొంత పార్టీకి చెందిన చైర్పర్సన్ కొత్త ఆర్తికను గద్దె దించితే కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుం టుందనేది చర్చనీయాంశంగా మారింది. విప్‌ను ధిక్కరించిన వారిపై తక్షణం అనర్హత వేటు వేయక పోతే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అధికారం ఎలక్షన్ కమిషన్‌కు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అవిశ్వాస రాజకీయం ఎటు మలుపుతిరుగుతుందో వేచి చూడాల్సిందే.