వికారాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): తాండూరు నియోజకవర్గ కాం గ్రెస్‌లో ఆధిపత్య పోరు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్లు ఉన్నా ఇప్పటి నుంచే వచ్చే ఎన్ని కల్లో బరిలో నిలిచేందుకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి-ఎమ్మెల్యే బు య్యని మనోహర్‌రెడ్డి మధ్య నువ్వా -నేనా..? అన్నట్టు పోటీ మొదలైందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. తాండూరు సెగ్మెంట్ లో దాదాపు 20 ఏండ్లపాటు ఏకచత్రాధిపత్యంలా వ్యవహరించిన పట్నం మహేందర్‌రెడ్డి గత ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయకుంటే మహేందర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇక ముగిసినట్లేనన్న ప్రచారంతో రానున్న ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకునేలా శతవిధాలా యత్నిస్తున్నట్టు ఆయన వర్గం నాయకుల ద్వారా తెలిసింది.
అందుకోసం ఇప్పటి కే వ్యూహాలను పదునుపెట్టినట్టు సమాచారం. కాగా, ఆయన బీఆర్ఎస్లో చేరేందుకు యత్నించగా.. ఆ పార్టీ నో చెప్పినట్టు ప్రచారమూ ఉన్నది. అంతేకాకుండా మనోహర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పరిగి నియోజకవర్గం నుంచి ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ వర్గం సెగ్మెంట్లో జోరుగా ప్రచారం చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. మరోవైపు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్న మహేందర్‌రెడ్డి వర్గం నాయకులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది.
తాండూరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ వస్తున్న మనోహర్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వ్యూహాలకు చెక్ పెడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్నది. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్‌తో సన్నిహితంగా ఉంటున్నా టికెట్ వరకు వస్తే ఇరువురిలో ఎవరి వైపు సీఎం మొగ్గు చూపుతాడనే దాని పై ఇద్దరు నాయకుల్లోనూ టెన్షన్ నెలకొన్నది.
తాండూరు ఎమ్మెల్యేగా గెలిచిన మనోహర్‌రెడ్డిని వచ్చే ఎన్నికల నాటికి తన సొంత నియో జకవర్గమైన పరిగికి మకాం మారుస్తారనే ప్రచారం తాండూరు సెగ్మెంట్లో జోరందుకున్నది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పరిగి టికెట్ ఆశించినా…సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మహేశ్‌రెడ్డికి కాదని మనోహర్‌రెడ్డికి ఇచ్చే పరిస్థితి లేకపోవడంతోపాటు పట్నం మహేందర్‌రెడ్డి కూడా బీఆర్ ఎస్‌లోనే ఉండడంతో అనుకోకుండా కాంగ్రెస్ నుంచి తాండూరు ఎమ్మెల్యే టికెట్ మనోహర్ రెడ్డిని వరించింది.
మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ ఆరేడు నెలలకు మహేందర్‌రెడ్డి వర్గం నాయకులంతా ఎమ్మెల్యేకు దగ్గరైనా వారంతా ప్లాన్‌లో భాగంగానే దగ్గరయ్యారనే ప్రచారమూ ఉన్నది. ఎన్నికల సమయానికి టికెట్ విషయంలో నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల అభిప్రాయం తీసుకుంటే వారంతా పట్నంవైపే అనుకూలంగా అభిప్రాయం వెల్లడిస్తారనే చర్చకూడానడుస్తున్నది. మనోహర్‌రెడ్డికి టికెట్ రాదని తెలిస్తే ఆయన వెనుక ఉన్న నాయకుల్లో ఒక్కరు కూడా ఉండరని, అంతేకాకుండా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరుడే అన్ని విషయా ల్లోనూ తలదూరుస్తూ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుండడం నచ్చని తాండూరు సెగ్మెంట్ కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా మహేందర్‌రెడ్డి లేదా మహేందర్‌రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఎవరికి టికెట్ వచ్చినా పూర్తి మద్దతిచ్చి పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
అంతేకాకుండా మనోహర్‌రెడ్డి ఇక పరిగి నియోజకవర్గవైపు చేస్తున్నారనే ప్రచారాన్ని కూడా మహేందర్‌రెడ్డి వర్గం కావాలనే చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. మనోహర్‌రెడ్డి వర్గం మాత్రం రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే పరిగికి మకాం మారుస్తారనే ప్రచారాన్ని తిప్పికొడుతున్నది.ఎట్టిపరిస్థితుల్లోనూ తాం డూరు నుంచే మనోహర్‌రెడ్డి పోటీ చేస్తారని స్పఫ్టం చేస్తున్నది. ఒకవేళ తాండూరు నుంచి మనోహర్‌రెడ్డికి పోటీ చేసే ఆలోచన లేకుంటే ఆయన సోదరుడు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సన్నిహితులతో చెప్తున్నట్టు సమాచారం. రెండున్నరేండ్లు ఉండగానే తాండూరు కాంగ్రెస్‌లో వేడెక్కిన రాజకీయాన్ని ఆపార్టీ హైకమాండ్ చల్లారుస్తుందా ..? చూస్తూ ఉండిపోతుందా?.. తెలియాలంటే మరి కొన్ని రోజులు నిరీక్షించాల్సిందే.
వచ్చే ఎన్నికల్లోనూ తాండూరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా.వేరే నియోజ కవ ర్గంలో పోటీ చేసే ఆలోచనే లేదు. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా.