షాద్‌నగర్ రూరల్, మే 24 : గత బీఆర్ఎస్ హయాంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్లాట్ల బుకింగ్ జరిగేది. కానీ, నేడు స్లాట్ల బుకింగ్‌లో మార్పులు తీసుకురావడంతో ప్లాట్ల క్రయవిక్రయదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. షాద్‌నగర్ పట్టణంలో రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు లో ప్రతిరోజూ 48 స్లాట్లు బుకింగ్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే, స్లాట్ బుక్ చేసుకునే సమయంలో ఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అనే ఆప్షన్ లేకపోవడంతో క్రయవిక్రయదారుల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
కొనుగోలు, అమ్మకందారులు ఒక కార్యాలయంలో స్లాట్ బుకింగ్ అయి ఉంటే మరొ కార్యాలయానికి వెళ్లడం ద్వారా సమయం వృథా అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక వ్యక్తి రెండు లేదా మూడు ప్లాట్లను కొనడం, అమ్మడం చేసి.. స్లాట్ బుకింగ్ చేసుకుం టే ఒకే సమయంలో రెండు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఉంటే తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అధికారు లు స్పందించి స్లాట్ బుకింగ్ సంఖ్యను పెంచడంతోపాటు స్లాట్ బుకింగ్ ఆప్షన్ కూడా ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
షాద్‌నగర్‌లో ప్లాట్లు కొన డం, అమ్మడం చేసి స్లాట్ల ను బుక్ చేసుకుంటే.. ఒక స్లాట్ ఒక కార్యాలయం లో, మరో స్లాట్ మరొక్క కార్యాలయంలో బుక్ అవుతున్నాయి. దీనికి తోడు రెండు కార్యాలయాల్లోనూ ఒకే సమయంలో వస్తుండడంతో చాలా ఇబ్బందిగా ఉన్నది. స్లాట్ బుక్ చేసుకునే సమయంలో కార్యాలయాలకు సంబంధించిన ఆప్షన్‌ను ఇవ్వాలి.
-పవన్, రియల్టర్, షాద్‌నగర్
రియల్ ఎస్టేట్ రంగంలో షాద్‌నగర్ పట్టణం అగ్రగామిగా ఉన్నది. దీనిని దృష్టిలో ఉంచుకుని షాద్‌నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ల బుకింగ్ సంఖ్యను పెంచాలి. ప్రస్తుతం రోజూకు 48 స్లాట్లను బుక్ చేసుకునేలా అవకాశం ఉంది. వాటి సంఖ్యను పెంచాలి
-సురేశ్, రియల్టర్, ఎలికట్ట