వికారాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ సర్కార్ అందజేసే అరకొర సాయంతో ఇండ్ల నిర్మాణం సాధ్యం కాదని.. వెనకడుగు వేసిన ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేసి జాబితాల్లో పేర్లు వచ్చి వారిపై అధికారులు ఒత్తిడి తీసుకొస్తు న్నారు. ఇండ్ల నిర్మాణం చేపడుతారా..? లేదా..? ఒకవేళ చేపట్టకపోతే రాతపూర్వకంగా తాము ఇండ్ల నిర్మాణం చేపట్టలేమని రాసివ్వాలంటూ సూచిస్తున్నారు.
అధికారులు ఒత్తిడితో కొందరు ఆందోళన చెందుతుండగా.. మరికొందరు ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి సాయం అందజేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పులు చేసి పునాది వరకు నిర్మాణం పూర్తి చేసినా సాయం అందించకపోవడంపై లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా, ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో ప్రస్తుతం గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సర్కార్ నిర్లక్ష్యం..
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నది. మొదట పైలట్ ప్రాజెక్టు పేరిట మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన సర్కార్.. పైలట్ గ్రామాలు, లబ్ధిదారులను ఎంపిక చేసి ఆరు నెలలు పూర్తవుతున్నా ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సర్కార్ అందిస్తున్న అరకొర సాయంతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. లబ్ధిదారుల ఎంపిక పూర్తికాగానే రూ. లక్ష సాయాన్ని అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. తదనంతరం తప్పనిసరిగా బేస్మెంట్ వరకు నిర్మిస్తేనే రూ.లక్ష ఆర్థిక సాయం అందుతుందని ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందులు పడుతున్నారు.
438 మందికే రూ.లక్ష సాయం
జిల్లాలో ఇప్పటివరకు మార్కింగ్ పూర్తైన ఇండ్లలో కనీసం పది శాతం మందికి కూడా రూ.లక్ష సాయాన్ని ప్రభుత్వం అందించలేకపోయింది. జిల్లాకు మొదటి విడతలో 2,309 ఇండ్లు, రెండో విడతలో 8,417 ఇండ్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 5,506 ఇండ్లకు మార్కింగ్ పూర్తికాగా 598 మంది లబ్ధిదారులు పునాది వరకు నిర్మాణం పూర్తి చేయగా కేవలం 438 మందికే రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందింది.
గోడల వరకు 69 ఇండ్లు, స్లాబ్స్ వరకు 25 ఇండ్లు పూర్తయ్యాయి. అయితే 53 మందికి రూ.2 లక్షల వరకు, 20 మందికి రూ.4 లక్షల వరకు అందజేశారు. కొం దరు అప్పులు చేసి పునాది వరకు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసినా ఇంకా ప్రభుత్వ సాయం అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. అర్హులకు రూ.లక్ష చొప్పున సాయం అందించామని జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.