బొంరాస్‌పేట, ఫిబ్రవరి 18 : ప్రభుత్వ కార్యాలయాల్లో కంపూటర్ల వినియోగం పెరిగిపోయింది. ఆఫ్‌లైన్ పనుల కంటే ఆన్లైన్ పనులకు ఎక్కువగా ప్రాధాన్యం పెరుగుతున్నది. ప్రభుత్వ శాఖల్లో జరిగే వివిధ కార్యకలాపాలు, అభివృద్ధి పనులు, నిధుల వినియోగం తదితర విషయాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని, జిల్లా అధికారులకు పంపే నివేదికలను కూడా ఆన్లైన్లో మండల అధికారులు పంపుతున్నారు. విద్యాశాఖలో కూడా కంప్యూటర్ల వినియోగం బాగా పెరిగింది.
మండలంలోని అన్ని పాఠశాలల వివరాలు, విద్యార్థుల వివరాలు, పాఠశాలలకు మంజూరవుతున్న నిధులు, ఖర్చు చేసిన వివరాలు, చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థుల వివరాల నమోదు, యూడైస్‌లో పాఠశాలల వివరాల నమోదు తదితర ఎన్నో వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. మండలస్థాయిలో విద్యాశాఖకు మండల విద్యా వనరుల కేంద్రాలు(ఎంఆర్సీ) ఉన్నాయి. వీటిలో చాలా ఏండ్ల నుంచి ఒక్కొక్క కంప్యూటరే ఉంది. దీంతో ఆన్లైన్లో వివరాలను నమోదు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఎంఆర్సీలకు కంప్యూటర్లను సరఫరా చేసింది. ఒక్కో ఎంఆర్సీకి 6 కంప్యూటర్ల చొప్పున జిల్లాలోని 19 ఎంఆర్సీలకు కంప్యూటర్లను ప్రభుత్వం సరఫరా చేసింది. దీంతో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నివేదికలు పంపించడానికి, విద్యార్థుల వివరాలను నమోదు చేయడానికి అవకాశముంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
వికారాబాద్ జిల్లాలో ఒక్కో ఎంఆర్సీ కార్యాలయంలో ఒక ఎంఐసీ కోఆర్డినేటర్, నాలుగు నుంచి ఆరుగురు వరకు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు(సీఆర్పీలు) ఉన్నారు. ఆయా క్లస్టర్ల పరిధిలోని పాఠశాలలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఎంఆర్సీ కార్యాలయంలోని కంప్యూటర్లలో నమోదు చేస్తున్నారు. గతంలో ఒకటే కంప్యూటర్ ఉన్నపుడు డాటా ఎంట్రీకి ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రస్తుతం ఆరు కంప్యూటర్లు రావడం వల్ల డాటా ఎంట్రీకి, ఆన్లైన్ విద్యాశాఖకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి సులభమైందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. వికారాబాద్ జిల్లాలోని అన్ని ఎంఆర్సీ కార్యాలయాల్లో కంప్యూటర్లను బిగించారు.
వికారాబాద్ జిల్లాలోని 19 ఎంఆర్సీ కార్యాలయాలకు ఆరేసి చొప్పున కంప్యూటర్లను సరఫరా చేసి వాటిని ఏర్పాటు చేశాం. కంప్యూటర్ల ఏర్పాటు వల్ల పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వాటిలో నమోదు చేయడానికి అవకాశం కలుగుతుంది. ఎంఐఎస్ కోఆర్డినేటర్లతో పాటు సీఆర్పీలు కూడా వీటిని ఉపయోగించి డాటాను అవసరమైన సమాచారం నమోదు చేయడానికి అవకాశం ఉంది.
– రేణుకాదేవి, డీఈవో వికారాబాద్