రంగారెడ్డి, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆదివా రం 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లా సమగ్రాభివృద్ధితోపాటు పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించామన్నారు. 5,376 మంది ఎన్యూమరేటర్లతో 5,62,598 కుటుంబాల సమగ్ర సమాచారాన్ని సేక రించామన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రక్రియలో భా గంగా ఆదివారం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి నాలుగు పథకాలను ప్రభుత్వం ప్రా రంభించిందన్నారు. రైతుభరోసా కింద పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ.12,000 చెల్లిస్తుందని, అదేవిధంగా భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరో సా పథకం కింద పంపిణీ చేస్తుందని వివరించారు. అలాగే అర్హులందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు సర్కారు చర్యలు తీసుకున్నదన్నారు. గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లు నిర్మిం చుకునేందుకు సహకరిస్తుందన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, వ్యవసా యం, రైతుబీమా, ఆయిల్‌పామ్ సాగు, వన మహోత్సవం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయూత వంటి కార్యక్రమాల ద్వారా పేదలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
స్టాళ్లను ప్రారంభించిన కలెక్టర్..
గణతంత్ర వేడుకల సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను కలెక్టర్ ప్రారంభించి వాటి ప్రాధాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. గృహనిర్మాణం, గ్రామీణాభివృద్ధి, మహిళా పొదుపు సంఘాలు, అల్లికలు, ఉద్యానవనం వంటి స్టాళ్లను కలెక్టర్ ప్రారంభించారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు..
జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పలు ప్రణాళికలను రూపొందిస్తున్నదని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో నాల్గో అత్యాధునిక పట్టణాన్ని రూపొందిం చే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కందుకూరు మం డలంలోని పంజాగూడ సమీపంలో ఫోర్త్‌సిటీ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయన్నారు. ఫోర్త్‌సిటీకి కనెక్టివిటీ పెంచేందుకు కొం గరకలాన్ నుంచి ఫోర్త్‌సిటీ వరకు ఓ రోడ్డు, ట్రిపుల్ఆర్ నుంచి ఫోర్త్‌సిటీకి మరో రోడ్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే, జిల్లాలో ఐటీ పరిశ్రమలు, వివిధ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వ పరంగా సహకరి స్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్వో సంగీత, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, డీఈవో సుశీందర్‌రావు, డీపీవో సురేశ్‌మోహన్, డీఆర్డీఏ పీడీ శ్రీలత, ఆర్డీవోలు, జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు అదుర్స్
కలెక్టరేట్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇబ్రహీంపట్నం గురుకుల కళాశాల, కందుకూరు కేజీబీవీ పాఠశాల, తుక్కుగూడ, రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, పాలమాకుల ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాజేంద్రనగర్ మైనార్టీ కళాశాలకు చెందిన విద్యార్థుల దాండియా నృత్య ం, మహేశ్వరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గిరిజన నృత్యం ఎంతగానో ఆకట్టుకున్నాయి. నృత్య ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థినీవిద్యార్థులకు కలెక్టర్ జ్ఞాపికలు అందించి సత్కరించారు.
ఆకట్టుకున్న వైద్యారోగ్య శాఖ శకటం..
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలను గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ శకటం అందరినీ ఆకట్టుకున్నది. గుండెనొప్పితో పడిపోయిన ఓ వ్యక్తికి సీపీఆర్ చేస్తూ నిర్వహించిన శకటం కన్నులను కట్టి పడేసింది. డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటం ముందు ఓ వ్యక్తికి సీపీఆర్ చేస్తున్నట్లుగా ప్రదర్శించారు. అలాగే, డీఆర్డీఏ, ఆర్టీసీ, ఫిషరీస్ వంటి శాఖలు తమ శకటాలను ప్రదర్శించాయి.