రంగారెడ్డి, మే 2 (నమస్తే తెలంగాణ) : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యం లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వంటగ్యాస్ సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. గత మూడు నెలల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. ముఖ్యంగా చిరు వ్యాపారులు పెరిగిన ధరలతో వాణిజ్య సిలిండర్లను కొనలేక తమ వ్యాపారాలను మూసేసుకుంటుండగా.. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వంటగ్యాస్ కొరతను కొంతమంది గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుని బ్లాక్ మార్కెట్‌కు తరలించి డబ్బులు దండుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్లో రూ.3000ల సిలిండర్‌ను రూ.6000 విక్రయిస్తున్నట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాణిజ్య సిలిండర్ల ధరలు విపరీతంగా పెరగడంతో కొంతమంది వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్ల కొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీంతో గృహ యజమానులకు డొమెస్టిక్ సిలిండర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లాలో ప్రజలు గ్యాస్ కష్టాలను ఎదుర్కోక తప్పటంలేదు. మరోవైపు గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ఒకసారి బుక్ చేశాక తిరిగి బుక్ చేయాలంటే దాదాపు నెల రోజులు ఎదురు చూడక తప్పని దుస్థితి నెలకొన్నది. ఒక కనెక్షన్ ఉన్నవారు 21 రోజులు, రెండు కనెక్షన్లు ఉన్నవారు 25 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలని నిబంధన విధించారు. దీంతో గ్యాస్ బుక్ చేసుకోవాలంటే మూడు నుంచి నాలుగు వారాలు ఎదురు చూడక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. దీంతో సిలిండర్ల కో సం వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు.
కృత్రిమ కొరత సృష్టిస్తూ..
ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే రెండుసార్లు గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచింది. ఇండియన్ గ్యాస్ కమర్షియల్ సిలిండర్ గతంలో రూ.2,300లు ఉండగా.. ప్రస్తుతం రూ.3,300లకు పెరిగింది. అలాగే, గృహావసరాలకు ఉపయోగించే సిలిండర్ ధర గతంలో రూ.900 ఉండగా, ప్రస్తుతం రూ.965కు విక్రయిస్తున్నా రు. 5 కేజీల చిన్న సిలిండర్ ధర గతంలో రూ.650 ఉండగా ప్రస్తుతం రూ.900లకు చేరింది. భారత్ గ్యాస్ కమర్షియల్ సిలిండర్ ధర గతంలో రూ.2100 ఉండగా ప్రస్తుతం రూ.2,350లకు.. అలాగే, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.965 వరకు పెరిగింది. 5 కేజీల సిలిండర్ ధర గతంలో రూ.600 ఉండగా ప్రస్తుతం రూ.900లకు చేరింది.
దీంతో పెరిగిన వంటగ్యాస్ ధరలు చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మరోవైపు గ్యాస్ ధరలు పెరిగినా మార్కెట్లో సరిపడా సిలిండర్లు లేకపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏజెన్సీల నిర్వాహకులు, మధ్యదళారులు కమర్షియల్ సిలిండర్లను నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో ఒక్కో కమర్షియల్ సిలిండర్‌ను రూ.5,000 -రూ.6,000 వరకు విక్రయిస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను కొనలేక జిల్లాలోని చాలామంది చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను మూసేస్తున్నారు.
కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించాలి
గత కొన్నేండ్లుగా తుర్కయాంజాన్ సమీపంలో టీస్టాల్ నిర్వహిస్తున్నా. అమెకా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ ధర విపరీతంగా పెరిగింది. బ్లాక్ మార్కెట్లో రూ.ఐదువేలకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా సిలిండర్ల దొరక్కపోవడంతో టీస్టాల్ కొనసాగకపోవడంతో మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్రం జోక్యం చేసుకుని గ్యాస్ ధరను తగ్గించి.. చిరు వ్యాపారులు, నిరుపేదలు, సామాన్యులకు ఆదుకోవాలి.
– రమేశ్, స్వాగత్ టీస్టాల్ కమ్మగూడ
అంత పెంపా..?
గత నెలలో ఇరాన్-అమెరికా దేశాల మధ్య యుద్ధంతో మన దేశంలో గ్యాస్ కొరత ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడ్డాం. కేంద్ర ప్రభు త్వం పలు రాష్ర్టాల్లో ఎన్నికలు ముగియగానే వాణిజ్య సిలిండర్‌పై ఒకేసారి రూ.993లు పెంచడంతో వ్యాపారులతోపాటు సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుం ది. సిలిండర్ ధర పెరగడంతో హోటళ్లలో టిఫిన్లు, భోజనం చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే ఆ ధరలు కూడా ఒకేసారి భారీగా పెరుగుతాయి. మోదీ ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలి.
-సి.సుజాత గృహిణి, పూడూరు
పేదలపై మోయలేని భారం
కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ ధరను రూ.993 పెంచి పేదలపై మోయలేని భారాన్ని మోపింది. పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి. పలు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే గ్యాస్ ధర పెంచి, పేదల నడ్డివిరిచింది. కేంద్రం మొండి వైఖరిని వీడి సామాన్యులపై భారాన్ని తగ్గించాలి. మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానా లను అనుసరిస్తున్నది. ఇది చాలా దారుణం.
-శకుంతల దేశ్‌పాండే, గౌతాపూర్, తాండూరు రూరల్
కమర్షియల్ కనెక్షన్లు 60 వేలకు పైగానే..
జిల్లాలో రూ.60వేలకు పైగా కమర్షియల్, అలాగే, 1,40,000 పైగా డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లున్నాయి. అలాగే, ప్రైవేట్ ఏజెన్సీలకు సంబంధించిన కనెక్షన్లూ మరో 15 నుంచి 20వేల వరకు ఉంటాయి. కమర్షియల్ సిలిండర్లను హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు తదితర వాటిల్లో అధింగా వినియోగిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, తుక్కుగూడ, ఆదిబట్ల, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, గండిపేట, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో అత్యధికంగా హోటళ్లు, టిఫిన్‌సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. వీటిపైనే ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. గ్యాస్ కొరతతో అనేకమంది తమ ఉపాధిని కోల్పోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరగడంతో హోటళ్లు, టిఫిన్ , ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఆయా తినుబండారాల ధరలనూ పెంచారు. దీని ప్రభావం సామాన్యులపై తీవ్రంగా పడింది. కాగా, ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు గ్యాస్ ధరలను పెంచడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
చిరు వ్యాపారులు రోడ్డున పడుతున్నారు..
పలు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్ ధరను పెంచడం దుర్మార్గం. మోదీ ప్రభు త్వం ఒకేసారి 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.993కు పెంచడంతో దాని ధర రూ.3,315కు చేరింది. వాణిజ్య సిలిండర్ ధర పెంపు ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులపై తీవ్రంగా పడింది. అంతేకాకుండా చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడి లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నది. కార్మికుల దినోత్సవం రోజునే గ్యాస్ ధరను పెంచి పేదల నడ్డి విరవడం శోచనీయం.
-కొమ్ము ప్రసాద్, బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకుడు, ఆమనగల్లు
హోటల్ వ్యాపారం గిట్టుబాటు కావడంలే..
గత రెండు నెలలుగా వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఉన్నది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను రూ.993కు పెంచడంతో దాని ధర రూ.3315కు చేరింది. నెల రోజుల కిందట కూ డా రూ. 250 వరకు పెంచారు. ఇప్పటికే బ్లాక్ లో కమర్షియల్ సిలిండర్‌ను రూ. 4 వేలకు పైగా విక్రయిస్తున్నారు. ఇప్పుడు బ్లాక్‌లోనూ ఆ బండ ధర భారీగా పెరుగనున్నది. పెరిగిన ధరతో హోటల్‌ను నిర్వహించడం భారంగా మారింది.
-భానప్ప, హోటల్ యజమాని, తాండూరు ఎన్టీఆర్ కాలనీ
కేంద్రానికి అధికారంపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు
గత మూడు నెలలుగా వంట గ్యాస్ సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దొరికిందే అదునుగా కేంద్రం గ్యాస్ ధరను పెంచుతూ పోతున్నది. బుక్ చేసి తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా గ్యాస్ రావటంలేదు. ప్రజల గురించి ప్రభుత్వాలు ఆలోచించడంలేదు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సామాన్య ప్రజల సంక్షేమం కంటే అధికారం కోసమే వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నయ్.
-మడుపు లక్ష్మమ్మ, కౌన్సిలర్ ఇబ్రహీంపట్నం
టీ స్టాళ్లు, హోటళ్లు మూసుకోవాల్సిందే..
గ్యాస్ వినియోగదారులను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నది. గత నెల, రెండు నెలలుగా సిలిండర్లు లభించక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్యాస్ కోసం ప్రజలు ఏజెన్సీల ఎదుట ఉదయం నుంచే నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఒకేసారి వాణిజ్య సిలిండర్ల ధరను కేంద్రం పెంచడంతో టీ స్టాళ్లు, హోటళ్లు, హాస్టళ్లను మూసుకునే పరిస్థితి ఏర్పడింది.
-మందిపల్ వెంకట్, మందిపల్ మాజీ ఎంపీటీసీ, చౌడాపూర్ మండలం
సామాన్యులపై భారం తగదు
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గత రెండేండ్లుగా మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ పేద, మధ్యతరగతి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నది. ఒకేసారి రూ.993లు పెంచితే చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారిపై తీవ్ర ప్రభావం పడు తుంది. వారు వాటిని మూసే యాల్సిన దుస్థితి నెలకొన్నది.
-అలిగేరి కల్పన, గృహిణి గంజిపల్లి, దోమ మండలం
రంగారెడ్డి జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు (సుమారు)
కమర్షియల్ : డొమెస్టిక్
60,000 :1.40 లక్షలు
కమర్షియల్
ఇండియన్ : భారత్
2300(గతంలో) :2100(గతంలో)
3300(ప్రస్తుతం) : 2350(ప్రస్తుతం)
డొమెస్టిక్
ఇండియన్ :భారత్
900(గతంలో) :900(గతంలో)
965(ప్రస్తుతం) :965(ప్రస్తుతం)
5కేజీ సిలిండర్
ఇండియన్ :భారత్
650(గతంలో) :650(గతంలో)
900(ప్రస్తుతం) :900(ప్రస్తుతం)
వికారాబాద్ జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు
కమర్షియల్ :డొమెస్టిక్
3,209 :2,05,344
కమర్షియల్
ఐవోసీఎల్ :2869
హెచ్‌పీసీఎల్ :144
బీపీసీఎల్ :196
మొత్తం :3,209
డొమెస్టిక్
ఐవోసీఎల్ : 85600
హెచ్‌పీసీఎల్ :88878
బీపీసీఎల్ :30866
మొత్తం :2,05,344