కొడంగల్, జనవరి 23 : కడా పరిధిలో ఇప్పటివరకు మంజూరైన అభివృద్ధి పనులకు వెంటనే గ్రౌండింగ్ చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కడా కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ.. నిధులు మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.
బీసీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల నిర్మా ణ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బొంరాస్‌పేట, గుండుమాల్ మండలాల్లో చేపట్టే సమీకృత పాఠశాలల భవనాలు, ఆర్అండ్బీ ద్వారా చేపట్టే వెటర్నరీ వైద్య కళాశాలకు సంబంధించిన పనులను కూడా త్వరలోనే మొదలు పెట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు కళాశాలలకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు.సమావేశంలో తాండూరు సబ్‌కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, నారాయణపేట ఆర్డీవో రాం చందర్, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ వసంత్‌నాయక్, ఈడబ్ల్యూఐడీసీ ఈఈ రాంకుమార్, డీఈ రాజు, ఇంజినీరింగ్ విభాగం ఈఈ, డీఈలు పాల్గొన్నారు.