కొత్త మద్యం విధానం ప్రకారం మద్యం దుకాణాలకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించనున్నది. ఈ మేరకు గురువారం ఉమ్మడి జిల్లాలోని మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు కల్పించారు. రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి లాటరీ ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేశారు. గౌడ వర్గానికి15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం లెక్కన దుకాణాలను కేటాయించారు. నేడు నోటిఫికేషన్ ఇవ్వడం తోపాటు మద్యం టెండర్లకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
-రంగారెడ్డి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం విధానం ప్రకారం రంగారెడ్డి జిల్లాలో 234 మద్యం షాప్‌లకు టెండర్లు నిర్వహిస్తున్నారు. ఈమేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ కానుంది. గత ఏడాది తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు టెండర్లలో రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం ఈసారి కూడా అదే విధానాన్ని అమలు చేయనుంది. గౌడ వర్గాలకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వ నిబంధనలను అనుసరించి 53 దుకాణాలను ఆయా సామాజిక వర్గాలకు కేటాయించారు. సరూర్‌నగర్ డివిజన్లో ఎస్టీలకు 2, ఎస్సీలకు 11, గౌడ సామాజిక వర్గాలకు 25 షాప్‌లను కేటాయించారు. శంషాబాద్ డివిజన్లో ఎస్సీలకు 6, గౌడ సామాజిక వర్గాలకు 9 షాప్‌లను కేటాయించారు. ఎస్టీలు ఎవరూ లేకపోవడంతో ఎస్టీ సామాజిక వర్గానికి షాప్‌లను కేటాయించలేదు.
లాటరీ ద్వారా ఎంపిక
ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు షాప్‌ల కేటాయింపుపై కలెక్టర్ హరీశ్ సమక్షంలో గురువారం రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో లాటరీ ప్రక్రియను నిర్వహించారు. ఎక్సైజ్, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, వెనుబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారుల సమక్షంలో డ్రా నిర్వహించి షాప్‌లను కేటాయించారు. మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేసినట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు కేటాయింపుల తర్వాత 181 మద్యం షాప్‌లు జనరల్ కేటగిరీ కింద మిగిలినట్లు కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రావు, శంషాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామారావు, బీసీ అభివృద్ధి అసిస్టెంట్ అధికారి నీరజరెడ్డి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రామేశ్వరి పాల్గొన్నారు.
లాటరీ ద్వారా రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు
వికారాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో రిటైల్ మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా కేటాయించినట్లు వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో 2023-25 సంవత్సరాలకు మద్యం దుకాణాలను ఎస్టీ, ఎస్సీ, గౌడ కమ్యూనిటీలకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి రిజర్వేషన్ మేరకు రిటైల్ మద్యం దుకాణాలను ఎక్సైజ్, గిరిజన, షెడ్యూల్ కులాల, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారుల సమక్షంలో కలెక్టర్ డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయించారు. వైన్ షాపులు కేటాయించే మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేశారు.
మద్యం షాపులు కేటాయించే సమయంలో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు షాపులను కేటాయించారు. జిల్లాలోని 59 మద్యం దుకాణాల్లో ఎస్టీలు 2, ఎస్సీలు 9, గౌడ వర్గాలకు 6 చొప్పున 17 దుకాణాలను ప్రభుత్వ ఎక్సైజ్ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి కేటాయించారు. 42 మద్యం షాపులను జనరల్ కేటగిరి కింద మిగిలినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌చంద్ర, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, వెనుకబడిన కులాల అభివృద్ధి అధికారి ఉపేందర్, ఎక్సైజ్ శాఖ అధికారులున్నారు.