వికారాబాద్, జూలై 13 : గతంలో దరఖాస్తు చేసుకొని అర్హత ఉన్నా.. గృహజ్యోతి పథకం అందనివారు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో వివరాలను సవరించుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండ్లు మారినవారు, విద్యుత్తు మీటర్ యూనిక్ సర్వీస్ నంబర్ అనుసంధానం చేయకపోవడం, దరఖాస్తుల్లో తప్పులు దొర్లడం తదితర కారణాల వల్ల ప్రయోజనాలు పొందలేనివారు వివరాలను అప్డేట్ చేసుకోవాలని పేర్కొన్నారు.
ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో విద్యుత్ బిల్లు, గ్యాస్ కనెక్షన్ నంబర్, రేషన్‌కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్‌కార్డులతోపాటు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న రసీదును తీసుకెళ్లి వివరాలను నమోదు చేయించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.