వికారాబాద్, జనవరి 19 : రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆదివారం వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ తనిఖీ చేశారు. మండలంలోని ధన్నారం గ్రామంలో సర్వే బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, తప్పిదాలకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. రైతుభరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకూ లబ్ధి చేసేందుకు.. సాగుకు యోగ్యమైన భూములను సర్వే నంబర్ల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నిర్ధారించడం జరుగుతుందన్నారు.
ఈ నెల 20 వరకు ఆయా పథకాల కింద అర్హుల జాబితాలను రూపొందించి, 21 నుంచి 24 వరకు ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో జరుగనున్న గ్రామసభల్లో వాటిని ప్రవేశపెట్టి చదివి వినిపించడం జరుగుతుందన్నారు. గ్రామసభ ఆమోదం మేరకు లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేస్తామన్నారు. ఈ నెల 26న ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు శ్రీకారం చుట్టి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చనున్నదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, అధికారులు ఉన్నారు.
రేషన్ కార్డు దరఖాస్తులను గ్రామసభల్లో తీసుకుంటామని కలెక్టర్ ఆదివారం ఒర ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులను అందిస్తామన్నారు. గ్రామసభలు, వార్డులు, ప్రజాపాలన, సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించిన వాటిని పరిశీలించి అర్హులకు జారీ చేస్తామన్నారు. ప్రజాపాలన ఫారంతోపాటు ఇచ్చిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులను సమ న్వయం చేసుకుంటా రేషన్ కార్డుల వెరిఫికేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. 21 నుంచి నిర్వహించనున్న గ్రామ సభల్లోనూ దరఖాస్తు తీసుకుంటామని.. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ అందిస్తామని ఆయన పేర్కొన్నారు.