రంగారెడ్డి, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో భూభారతి సదస్సుల ద్వారా వచ్చి న దరఖాస్తులను వచ్చే నెల 10తేదీ లోపు పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ..వాటి సాధ్యాసాధ్యాలపై తహసీల్దార్లు తర్జన భర్జన పడుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితిలో ఆ అప్లికేషన్లను గడువులోగా పరిష్కరించడం వారికి సవాల్‌గా మారింది. జిల్లాలో ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన భూభారతి సదస్సులకు 21,000 దరఖాస్తులొచ్చాయి. అవి అన్ని కూడా కొన్నేండ్లుగా పరిష్కారానికి నోచుకోక కార్యాలయాల్లోనే మగ్గుతున్నాయి.
అందు లో మిస్సింగ్ సర్వేనంబర్ల దరఖాస్తులు దాదాపుగా 9,000 వరకు ఉన్నాయి. వాటి పరిష్కారానికి సర్వేయర్, ఆర్ఐ రిపోర్టులు తప్పనిసరి. అయితే, సర్వేయర్ల కొరత జిల్లా లో అధికంగా ఉన్నది. ఒక్కొక్క సర్వేయర్ నాలుగు నుంచి ఐదు మండలాలకు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తుండడంతో వారి రిపోర్టులు సకాలంలో అందే అవకాశాలూ లేవు. వచ్చి న అప్లికేషన్లలో పెండింగ్ మ్యుటేషన్ల కింద 1,165, డీఎస్ పెండింగ్ 1,200, విస్తీర్ణం కరెక్షన్ 2,000, నిషేధిత జాబితా నుంచి తొలగించేవి 1600, పేరు మార్పు 750, ల్యాండ్ నేచర్ 1,000, అసైన్డ్ భూముల సమస్యలు 700, సర్టిఫికేషన్ పెండింగ్ 1650 వంటివి ఉన్నాయి.
ఈ దరఖాస్తుల ను త్వరగా పరిష్కరించడం అంత సాధ్యమై న పని కాదని కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో భూవిస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సరిహద్దు వివాదాలు అధికంగా ఉన్నాయి. జిల్లాలోని 27 మండలాల్లో 526 గ్రామ పంచాయతీలుండగా.. సర్వేయర్లు మాత్రం 14 మంది మాత్రమే పనిచేస్తున్నారు. తద్వారా ఈ సమస్యల పరిష్కారం వచ్చే నెల 10 తేదీలోపు అవుతాయా అని తహసీల్దార్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
వేధిస్తున్న సర్వేయర్ల కొరత..
జిల్లాలోని 27 మండలాల్లో 14 మంది సర్వేయర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఉన్న సర్వేయర్లపైనే మిగిలిన మండలాల పని ఒత్తిడి పడడం.. దానితోపాటు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వే, ఫార్మా భూముల కంచె ఏర్పాటు సర్వేతోపాటు ఇతర ప్రభుత్వ పనులకు వారిని పురమాయిస్తున్నారు. దీంతో భూభారతిలో వచ్చిన దరఖాస్తులను వచ్చే నెల పదో తేదీలోపు పరిష్కారం లభిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఆర్ఐలపైనా అదనపు భారం..
ఇప్పటికే రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న పని భారంతో ఇబ్బందిపడుతున్న ఆర్ఐలకు ఈ భూభారతి సమస్యల పరిష్కారానికి సంబంధించిన పనులు అదనపు భారం కానున్నా యి. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన నేపథ్యంలో కులం, ఆదా యం సర్టిఫికెట్లు, రేషన్‌కార్డుల దరఖాస్తుల పరిశీలనతోపాటు భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో బిజీగా ఉండే ఆర్ఐలకు భూభారతి రెవెన్యూ సదస్సులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో వారిపై పని ఒత్తిడి తీవ్రంగా పడే అవకాశమున్నది.