వికారాబాద్, ఏప్రిల్ 19 : అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టాల్పిన పనులను గుర్తించి వేగవంతంగా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఎంఈవో, ఎంపీడీవో, ఏఈ తదితర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టాల్సిన నిర్మాణ పనులను రెండు రోజుల్లో గుర్తించి ప్రారంభించాలని ఆదేశించారు. అన్ని పాఠశాలలను పరిశీలించి ఏ పాఠశాలలో ఏ పనులు చేయాల్సి ఉంది.. పిల్లలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంజూరైన నిధులతో ఆయా పాఠశాలల్లో ఈజీఎస్, పంచాయతీ రాజ్ ఎస్ఈ, డీఈలు, ఏఈలు ఇప్పటివరకు గుర్తించిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుంటూ నాణ్యతతో కూడిన పనులు పూర్తి చేయించాలన్నారు. మండలాల వారీగా అన్ని వివరాలు తెలుసుకున్నారు. జడ్పీ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్లు, అదనపు గదుల నిర్మాణ పనులు పూర్తి ప్రోగ్రెస్లోకి రావాలని సూచించారు. ఈఈలు, డీఈలు నిర్మాణ పనులను పర్యవేక్షించాలన్నారు. టెలికాన్ఫరెన్స్లో డీఈవో రేణుకాదేవి, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో జయసుధ, ఎంపీడీవోలు, ఎంపీవోలు, అన్ని మండలాల డీఈలు, ఏఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పర్యవేక్షించాలి.. పరిష్కరించాలి జిల్లాలోని ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రతి గ్రామాన్ని తప్పనిసరిగా పర్యవేక్షించి గ్రామ సమస్యలపై సమావేశాలు ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజూ తమ పరిధిలో ఉన్న గ్రామాలను పర్యవేక్షించాలన్నారు. గ్రామ పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, వీధి లైట్లు, నర్సరీ, హరితహారం తదితర సమస్యలపై సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పరిధిలో ముందు ఎలా ఉంది.. తర్వాత ఎలా ఉందనేది ఫొటోలతో నివేదిక ఇవ్వాలని సూచించారు. గ్రామ స్థాయిలో పరిపాలన పరంగా చేయాల్సిన పనుల బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. అనంతరం మండలాల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. టెలికాన్ఫరెన్స్లో డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో జయసుధ, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.