వికారాబాద్, జూన్ 14 : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని, విద్యార్థులకు యూనిఫామ్ల పంపి ణీ సక్రమంగా జరుగాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ సర్వే పనుల కోసం బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన ముగించాలన్నారు.
ఇంకా పూర్తి కాని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన తాగునీరు, మైనర్, మేజర్ మరమ్మతులు, టాయిలెట్స్, విద్యుద్దీకరణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఇప్పటివరకు పూర్తైన పనులు ఎన్ని.. ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయో మండలాల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించాలని ఉపాధ్యాయులు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు , అంగన్వాడీ సూపర్వైజర్లు, ఏపీఎంలకు సూచించారు. ఈ కాన్ఫరెన్స్లో డీఆర్డీఏ శ్రీనివాస్, డీఈవో రేణుకాదేవి, ఎంపీడీవోలు, జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.