కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూచించారు. చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని సోమవారం ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేందర్‌కుమార్ కటారియా, కౌంటింగ్ పరిశీలకులు మృణాళినీ సావంత్, వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డిలతో కలిసి రిటర్నింగ్ అధికారి శశాంక పరిశీలించారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, శేరిలింగంపల్లి, పరిగి, వికారాబాద్, తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ల లెకింపు కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్‌ను సందర్శించారు.
ఆయా కౌంటింగ్ హాళ్లలో టేబుళ్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెకింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ జరపాలని సహాయ రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ శశాంక సూచించారు. నిర్ణీత సమయానికి ఓట్ల లెకింపు ప్రారంభించేందుకు వీలుగా సన్నద్ధమై ఉండాలన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నియోజకవర్గ వివరాలను తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెకింపును చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.
ఎటువంటి పొరపాట్లు జరగకుండా నిబంధనలను తప్పకుండా పాటించాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటు తిరసరణకు గురైతే అందుకు గల కారణాలను అభ్యర్థులు, వారి ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఈవీఎంల ఓట్లను ఒకో రౌండ్ వారీగా లెకిస్తూ.. ప్రతి రౌండ్‌కు ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలన్నారు. ఓట్ల లెకింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు వచ్చి సరిచేస్తారని, కౌంటింగ్ ప్రక్రియను యధాతథంగా కొనసాగించాలన్నారు.
కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందితో పాటు, ఓట్ల లెకింపు కేంద్రాల్లో వివిధ కార్యకలాపాల నిర్వహణ కోసం నియమించబడిన వారికి పాసులు అందించాలని, పాసు కలిగి ఉన్న వారినే కౌంటింగ్ సెంటర్లోకి అనుమతించాలన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. రిటర్నింగ్ అధికారి వెంట అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, చేవెళ్ల డీసీపీ శ్రీనివాస్, అసెంబ్లీ నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.