రంగారెడ్డి, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : వర్షానికి జరిగిన నష్టం వివరాలను వెంటనే సమర్పించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి మంగళవారం కలెక్టర్ శశాంక ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో దాదాపు 40 ఇండ్లు పాక్షికంగా, రెండు ఇండ్లు పూర్తిగా కూలిపోయినట్లు గుర్తించామని కలెక్టర్ తెలిపారు.
ఇండ్ల నష్ట పరిహారానికి సంబంధించిన నివేదికలు వెంటనే కలెక్టరేట్‌కు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమష్టిగా నాలాల పరిసరాలను పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు తమ పరిధిలోని ఏదైనా విలువగల ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే వెంటనే వాటికి కంచె ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలోని 100 చెరువులకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ పెండింగ్‌లో ఉన్నదని, ఇప్పటి వరకు 925 చెరువుల్లో 99 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంకా 820 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉన్నదన్నారు. వారానికి 30 నుంచి 40 చెరువుల సర్వే నిర్వహిస్తే నోటిఫికేషన్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయడం జరుగుతున్నదని తెలిపారు. కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో లాండ్ ప్రొటెక్షన్ అధికారి కేఎస్బీ కుమారి, తహసీల్దార్లు, ఆర్డీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.