వికారాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. యాసంగి సీజన్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అంచనా వేసిన దానిలో 50 శాతం మేర కూడా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకపోవడం గమనార్హం. అయితే జిల్లావ్యాప్తంగా 129 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా, 113 కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లా పౌరసరఫరాల శాఖ ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలు సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 101 కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు మూసివేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి కావడంతో మరో రెండు రోజుల్లో మిగిలిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా మూసివేయనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ధాన్యాన్ని విక్రయించేందుకు మిగిలిపోయిన రైతులెవరైనా ఉంటే వారి నుంచి సేకరించేందుకు 12 కొనుగోలు కేంద్రాలను మరో రెండు, మూడు రోజులపాటు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వారం రోజులు దాటుతున్నా ధాన్యాన్ని విక్రయించిన రైతులకు చెల్లింపులు పూర్తికావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులు డబ్బులు కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. కొందరు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి పది రోజులైనా ఇంకా డబ్బులు ఖాతాల్లో జమ కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని సేకరించిన అనంతరం వెంటనే బిల్లులు చేయాల్సిన కొనుగోలు కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో జాప్యం జరుగుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో ఇప్పటివరకు 117.26 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించగా, రూ.27 కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. మరోవైపు యాసంగి సీజన్‌కుగాను వడ్లను క్వింటాలుకు ఏ గ్రేడ్ రకం రూ.2203 మద్దతు ధరను, సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2183 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నది. జిల్లాలో యాసంగిలో 84,848 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు.
53,228 మెట్రిక్ టన్నుల సేకరణ…
జిల్లాలో యాసంగి సీజన్‌కుగాను వరి ధాన్యం సేకరణ పూర్తైంది. జిల్లావ్యాప్తంగా 113 కొనుగోలు కేంద్రాల్లో 53,228 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే ఐకేపీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా 19,950 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 15,180 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా 16,128 మెట్రిక్ టన్నులు, ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా 1860 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని 59 రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 53180 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్స్‌కు సరఫరా చేశారు. అయితే జిల్లాలో యాసంగి సీజన్‌కుగాను 84,848 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా 1.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా, కేవలం 53,228 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు రావడం గమనార్హం. అదేవిధంగా రైతులకు ఇబ్బందులు కలుగకుండా వరి సాగు చేసిన 4-5 గ్రామాలకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఒకేరోజు రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకుండా కొనుగోలు కేంద్రం వద్ద ఐదుగురు చొప్పున రైతులుండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని ఎప్పుడు తీసుకురావాలనేది తేదీతో కూడిన టోకెన్లను అందజేసి జాగ్రత్త పడ్డారు.
వారంలోగా చెల్లింపులు పూర్తి చేస్తాం : జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
జిల్లాలో ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాం. చెల్లింపులు పెండింగ్‌లో ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో వారం రోజుల్లోగా జమ అయ్యేలా చూస్తాం. యాసంగి సీజన్‌కుగాను ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తి కావడంతో కొనుగోలు కేంద్రాలను మూసివేశాం. ఇంకా ధాన్యాన్ని విక్రయించని రైతుల సౌకర్యార్థం 12 కొనుగోలు కేంద్రాలను మరికొన్ని రోజులపాటు తెరిచి ఉంచుతాం.