రంగారెడ్డి, జూలై 14 (నమస్తే తెలంగాణ)/ అబ్దుల్లాపూర్‌మెట్ : అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని లష్కర్‌గూడలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించిన సందర్భంగా జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ‘కాటమయ్య రక్షణ కవచం’ కిట్ల పంపిణీ పథకాన్ని ఇక్కడి నుంచే లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
హయత్‌నగర్‌కు త్వరలోనే మెట్రోరైల్ రాబోతున్నదని.. ఇందుకు సంబంధించిన అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయన్నారు. ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూమిలో పలు యూనివర్సిటీలు, మెడికల్, టూరిజం, పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డుతోపాటు భవిష్యత్తులో రేడియల్ రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. న్యూయార్ సిటీతో పోటీపడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు.
ఊటీ కంటే అద్భుతంగా రాచకొం డ ప్రాంతాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అనువుగా మార్చుతామన్నారు. రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతున్నద ని, ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా జిల్లాను తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఏవీఎన్ రెడ్డి, దయానంద్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్, బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఆర్డీవో అనంత్‌రెడ్డి పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
అబ్దుల్లాపూర్‌మెట్ : మండలంలోని లష్కర్‌గూడ గ్రామానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మధ్యాహ్న భోజన కార్మికులు రాగా పోలీసులు అడ్డుకుని ముఖ్యమంత్రిని కల్పిస్తామని చెప్పి కల్పించకపోవడంతో ఆగ్రహించిన వారు సభలో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో సీఎం జోక్యం చేసుకొని వారిని ఏమి అనొద్దని పోలీసులకు చెప్పి వారి వద్దకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని పంపించి వారు ఇచ్చిన మెమోరాండాన్ని స్వీకరించారు.
సీఎంను కలవాలని రోడ్డుకు అడ్డంగా ఉండి కార్మికులు నినాదాలు చేయడంతో పోలీసులు కార్మికుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు స్వప్న, సీఐటీయూ జిల్లా నాయకుడు నర్సిం హ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు ఇవ్వొద్దన్నా రు. ఈ సంస్థకు అప్పగిస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించా రు. సీఐటీయూసీ నాయకులు కృష్ణ, ఎల్ల య్య, గణేశ్, మధ్యాహ్న భోజన కార్మికులు లక్ష్మమ్మ, నిర్మలమ్మ, రమాదేవి, రంగమ్మ, పుష్ప, స్వరూప, రాజమణి, నాగరాణి ఉన్నారు.
ఇబ్రహీంపట్నానికి పరిశ్రమలు తేవాలి
గడ్డిఅన్నారం పండ్ల మా ర్కెట్‌ను త్వరగా పూర్తి చేయడంతోపాటు విజయవాడ జాతీయ రహదారి వెంట నూతన పరిశ్రమలను ఏర్పాటు చే యాలి. తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. గీత కార్మికులకు కాట మయ్య రక్షణ కిట్ల పంపిణీ పథకాన్ని ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నది.
-మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే
గౌడ సోదరులకు మంచి జరగాలనే..
గౌడ సోదరులకు మంచి జరగాలనే ఆలోచనతోనే ప్రభుత్వం కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ పథకాని కి శ్రీకారం చుట్టింది. ఇది ప్రజాప్రభుత్వం. సర్కారు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతుంది.
– చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ