పరిగి, జూలై 30 : రైలు కూత వినాలన్నది పరిగి ప్రాంత ప్రజల అర్ధ శతాబ్దపు కల. వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ మంజూరును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎన్నికలకు ముందు ప్రకటించగా, పరిగి ప్రజల కల నెరవేరబోతున్నదని, రైల్వేలైన్ నిర్మాణం ఇక శరవేగంగా సాగనున్నదని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు.
రైల్వేలైన్ నిర్మాణ ఫైల్ దుమ్ము దులిపిన ప్రభుత్వం వెంటనే పనులు జరిగేలా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు చేపట్టారని, రూ.2వేల కోట్లతో రైల్వేలైన్ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వికారాబాద్ నుంచి పరిగి, దోమ మండలం మీదుగా కొత్త రైల్వేలైన్ నిర్మాణం జరుగుతున్నదని చెప్పడంతో కొద్ది కాలంలోనే పరిగి ప్రాంతానికి రైలు రాబోతున్నదని నియోజకవర్గ ప్రజలు సంతోషించారు. రైల్వేలైన్ పూర్తైతే పరిగితోపాటు దోమ, గండీడ్ మండలాలకు చెందిన ప్రజలు సైతం హైదరాబాద్‌కు రైలులో ప్రయాణించవచ్చని ఆశ పడ్డారు.
పక్కనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం ఉండడంతో రైల్వేలైన్ నిర్మాణం తప్పనిసరిగా జరిగి ఈ ప్రాంతంతో రైల్వే అనుసంధానం ద్వారా పారిశ్రామికంగా సైతం అభివృద్ధి చెందుతుందని ఆశించారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు పరిగి, దోమ మండలాల మీదుగా వెళ్లాల్సిన రైల్వేలైన్‌ను పరిగి శివారు నుంచి కొడంగల్ మీదుగా మళ్లించడంపై పరిగి ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పరిగి శివారు నుంచే రైల్వేలైన్ కొడంగల్ నియోజకవర్గానికి వెళ్తున్నదని, పరిగి ప్రాంతానికి రైల్వేలైన్ విషయంలో అన్యాయం జరుగుతున్నదని పలువురు పేర్కొంటున్నారు.
పరిగి ప్రజల అర్ధ శతాబ్దం కల..
రైల్వేలైన్ నిర్మాణం పరిగి ప్రాంత ప్రజల అర్ధ శతాబ్దం కల. ప్రతిసారీ ఎన్నికల హామీలో రైల్వేలైన్ నిర్మాణ అంశం నిలిచేది. వికారాబాద్ నుంచి పరిగి, దోమ మండలాల మీదుగా కృష్ణా వరకు రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలని గత యాభై ఏండ్ల క్రితమే ఓసారి సర్వే జరిగింది. అనంతరం రైల్వేలైన్ నిర్మాణం జరుగుతుందని రాజకీయ నాయకులు సైతం ఊరిస్తూ వచ్చారు. గతంలో పేర్కొన్న రూట్ ప్రకారం వికారాబాద్ నుంచి పరిగి, దోమ, సర్జఖాన్‌పేట్, మద్దూర్, నారాయణపేట్ తదితర ప్రాంతాల మీదుగా రైల్వేలైన్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు.
గత యూపీఏ హయాంలో అప్పటి కేంద్ర మంత్రి మునియప్ప సైతం పరిగిలో జరిగిన సమావేశంలో పాల్గొని వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. దశాబ్దం తర్వాత రైల్వేలైన్ నిర్మాణ అంశం మళ్లీ ప్రజల ముందుకు వచ్చింది. ఎన్నికల తర్వాత వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారని, ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని, రూ.2వేల కోట్లతో రైల్వేలైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో పరిగి ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఈ రైల్వేలైన్ దోహదం చేయనున్నదని ఈ ప్రాంతవాసులు భావించారు.
పరిగి నుంచి కొడంగల్..
కొత్తగా ప్రతిపాదించిన ప్రకారం రైల్వేలైన్ నిర్మాణం వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా చేపట్టాలని నిర్ణయించారు. 145 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణానికి రూ.3500 కోట్లు ఖర్చవుతాయని రైల్వే శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో రైల్వే అధికారులు రైల్వేలైన్ రూట్ మ్యాప్‌ను వివరించారు.
ఈ సందర్భంగా రైల్వేలైన్ రూట్ మ్యాప్‌పై సీఎం రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు. కొత్తగా ప్రతిపాదించిన రూట్లో రైల్వేలైన్ నిర్మాణం చేపడితే పరిగి ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నదని పలువురు పేర్కొంటున్నారు. గతంలో ప్రతిపాదించిన రూట్లో రైల్వేలైన్ నిర్మాణం చేపడితే పరిగి, దోమ, గండీడ్ మండలాల ప్రజలకు రైల్వేలైన్ అందుబాటులో ఉండేది. ఈ మూడు మండలాల వారు తమ సమీప స్టేషన్ల నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు రైలులో ప్రయాణించే సదుపాయం దక్కేది.
అలాంటిది ఏకంగా రైల్వేలైన్ రూట్‌ను మార్పుచేసి కొత్త మార్గం వల్ల దూరం పెరుగడంతోపాటు అంచనా వ్యయం సైతం పెరిగిందని, పరిగి ప్రాంతానికి రావాల్సిన రైల్వేలైన్ పరిగి నుంచి నేరుగా కొడంగల్‌కు వెళ్తున్నదని పేర్కొంటున్నారు. రైల్వేలైన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిగి ప్రాంతానికి అన్యాయం చేస్తున్నదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి గతంలో ప్రతిపాదించిన మార్గంలోనే రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ నిర్మాణ మార్గాన్ని మార్చడం వల్ల పరిగి ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాజీ వైస్ ఎంపీపీ గుర్మిట్కల్ మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి వికారాబాద్ నుంచి పరిగి, దోమ మండలాల మీదుగా రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలని కోరారు.
కొడంగల్ కోసం పరిగికి అన్యాయం..
వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్‌ను కొడంగల్ మీదుగా తీసుకువెళ్లడం కోసం పరిగి ప్రాంతానికి అన్యాయం చేయడం సరికాదు. గతంలోనే వికారాబాద్ నుంచి పరిగి, దోమ మండలాల మీదుగా కృష్ణా వరకు రైల్వేలైన్ నిర్మాణం చేపట్టడానికి సర్వే నిర్వహించారు. ఈ రైల్వేలైన్ నిర్మాణం చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గెలిచిన తర్వాత రైల్వేలైన్ రూట్ మార్చే ప్రయత్నం సరికాదు. కొత్త రైల్వేలైన్ నిర్మాణం రూట్ మార్పుతో నియోజకవర్గంలోని దోమ మండలానికి, ఇతర గ్రామాలకు అన్యాయం జరుగుతున్నది. అందువల్ల రైల్వేలైన్ నిర్మాణాన్ని గతంలో పేర్కొన్నట్లుగానే పరిగి, దోమ మండలాల మీదుగా చేపట్టాలి.
– కొప్పుల మహేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పరిగి