పరిగి, ఫిబ్రవరి 2 : పూడూరు మండల కేంద్రం సమీపంలోని దామగుండంలో నేవీ రాడార్ సెంటర్ ఏర్పాటైతే భవిష్యత్ తరాలకు ముప్పేనని పలువురు అభిప్రాయపడ్డారు. సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి వికారాబాద్ జిల్లా ప్రజల బతుకుల్లో మన్ను పోస్తున్నదని, సొంత జిల్లా ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం సీఎం రేవంత్‌రెడ్డికి తగదన్నారు. శుక్రవారం పరిగిలోని బృందావన్ గార్డెన్లో దామగుండంలో నేవీ రాడార్ సెంటర్ ఏర్పాటుపై దామగుండం అడవి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘ప్రకృతి విధ్వంసం-పరిణామాలు’ అనే అంశంపై చర్చావేదిక జరిగింది. ఇందులో పలువురు మాట్లాడడంతోపాటు పలు తీర్మానాలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆగమేఘాలమీద పాత ఫైల్ దుమ్ముదులిపి నేవీ రాడార్ సెంటర్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో వద్దని వ్యతిరేకిస్తే ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారన్నారు. సముద్రమట్టానికి ఎత్తైన ప్రాంతంలో ఉండే అనంతగిరి-దామగుండం జంట అడవుల్లో 12 లక్షల చెట్లను నరికివేస్తే జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నేవీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే దాని రేడియేషన్ ప్రభావం సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్న దృష్ట్యా, ఆ ప్రభావం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సైతం ముప్పుగానే పరిణమిస్తుందని హెచ్చరించారు.
సహజసిద్ధంగా అడవిలో మొలచిన ఔషధ మొక్కల నరికివేతతో ‘అనంతగిరికా హవా.. సౌ మరీజోంకా దవా’ అనే నానుడిగా మారుతుందన్నారు. రేడియేషన్ ప్రభావంతో చర్మవ్యాధులు, క్యాన్సర్, ఇతర వ్యాధులతో వన్యప్రాణులు, మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. పాశ్చాత్య దేశాలు వద్దనుకున్న ఎల్ఎఫ్ఎల్ రాడార్ సిస్టమ్‌ను భారత ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేస్తున్నదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ది ప్రజా ప్రభుత్వంగా చెప్పుకొంటున్న సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే.. భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరిగే రాడార్ కేంద్ర ఏర్పాటును ఎందుకు నిలిపివేయడం లేదన్నారు. ఏదైనా క్వారీకి అనుమతికోసం దరఖాస్తు చేస్తే పర్యావరణ అనుమతులు కోరే పాలకులు 3,000 ఎకరాల్లో ఏర్పాటుచేసే రాడార్ కేంద్రానికి పర్యావరణ అనుమతులు ఎలా వచ్చాయన్నారు.
రాడార్ కేంద్ర ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ దుమ్ము దులిపి తుది అనుమతులు ఇచ్చామని చెప్పిన మంత్రి కొండా సురేఖ, ఆ వెనువెంటనే గత ప్రభుత్వమే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిందని, రాడార్ కేంద్రంతో చీమకు కూడా హాని జరుగదని చెప్పడం ఆమె అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. రాడార్ కేంద్రం ఏర్పాటుపై అపోహలను నివృత్తి చేయాల్సిన ప్రభుత్వం.. దాని ఏర్పాటును పునఃపరిశీలించాలని కోరుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై అభివృద్ధి నిరోధకులు అనే ముద్ర వేయాలని చూస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు రూ.2500 కోట్లు మంజూరు చేయించానని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వారు విమర్శించారు. ఆ కేంద్రం ఏర్పాటైతే ఎలాంటి ప్రగతి ఉండదని.. ఉద్యోగాలూ రావన్నారు.
నేవీ రాడార్ కేంద్ర ఏర్పాటుతో కలిగే దుష్ర్పభావాలపై ఇంటింటికీ తిరిగి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి ఈ ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాల్లో లొసుగులపై కోర్టుల్లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను దాఖలు చేయాలని తీర్మానించారు. మరోవైపు ఈ నెల 5న కొడంగల్‌కు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేయాలని, అంతకుముందే అసెంబ్లీ స్పీకర్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజాఉద్యమంలో భాగంగా దామగుండంలోని రామలింగేశ్వరాలయంలో 2వేల మందితో 2 వేల కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని చేపట్టడంతోపాటు కలెక్టరేట్ ముట్టడికి కార్యాచరణను సిద్ధం చేయాలని తీర్మానించారు.
అలాగే దామగుండం ఆలయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేదా కేటీఆర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిద్దామని.. నేవీ రాడార్ వ్యతిరేక పోరాటంలో జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులందరూ భాగస్వాముల య్యేలా చూద్దామన్నారు. జేఏసీ జిల్లా చైర్మన్ ముకుంద నాగేశ్వర్ మాట్లాడుతూ రాడార్ కేంద్రం ఏర్పాటుతో రేడియేషన్ ప్రభావం వల్ల కలిగే నష్టాలపై సీఎం, మంత్రులు వాస్తవాలు ప్రజలకు వివరించాలన్నారు. అపోహలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యమ నాయకుడు దేవనోనిగూడెం వెంకటయ్య మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే అనేక దుష్ర్పభావాలతో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
నాయకుడు రాజలింగం మాట్లాడుతూ పూడూరు గ్రామపంచాయతీ తీర్మానం, రాజకీయ పార్టీల తరఫున విడివిడిగా కోర్టుల్లో కేసులు వేయాలన్నారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాట్లాడుతూ ఆక్సిజన్ పుష్కలంగా లభించే అడవుల నరికివేతతో హైదరాబాద్‌కు ముప్పు తప్పదన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు బి.రవికుమార్ మాట్లాడుతూ నలుగురికి ఉపయోగపడే పథకాలను రద్దు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఏ ఒక్కరికి ఉపయోగం లేని రాడార్ కేంద్రం ఏర్పాటును ఎందుకు రద్దు చేయడం లేదన్నారు. మాజీ ఉపసర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటును అనేక రాష్ర్టాలు వ్యతిరేకిస్తే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించడం తగదన్నారు. మంచన్‌పల్లి మాజీ డైరెక్టర్ సత్యం మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను హరించే రాడార్ సెంటర్ రద్దుకు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి పోరాడాలన్నారు.
దామగుండంలో నేవీ రాడార్‌పై బలమైన ప్రజా ఉద్యమాన్ని చేయడం ద్వారా ప్రభుత్వాన్ని లొంగదీద్దాం. ప్రజల ఉద్యమానికి అనేక ప్రభుత్వాలు లొంగాయి. భూమి కోసం, ఆక్సిజన్ కోసం ప్రపంచమంతా ఉద్యమాలు కొనసాగుతుంటే ఇక్కడ అడవుల నరికివేతతో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసే ప్రయత్నం జరుగుతున్నది. సెల్‌ఫోన్ టవర్ల వల్ల రేడియేషన్‌తో ఊరపిచ్చుకలు మొదలుకొని మానవళి మనుగడ కనుమరుగవుతుంది. రాడార్‌తో భవిష్యత్తు తరాలకు ప్రమాదం పొంచి ఉన్నది. సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి తప్ప విధ్వంసం జరిగేలా ఉండకూడదు.
– బి.విజయకుమార్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్
నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగాలు వస్తాయంటూ ఓ నాయకుడు ప్రచారం చేస్తున్నారు. ప్రకృతి సిద్ధ్దమైన అడవిని నాశనం చేస్తూ అభివృద్ధి అంటే ఊరుకోకూడదు. రాడార్ కేంద్రంతో ఉద్యోగాలనేది అసత్యం. లక్షలాది మొక్కల నరికివేతతో పర్యావరాణానికి ఎంత నష్టమనేది అంచనా వేయకుండానే ఏర్పాటుకు పూనుకున్నారు. రాడార్ కేంద్రం కాకుండా.. ఉపగ్రహాల ద్వారా సైతం సిగ్నల్స్ పంపించే పద్ధతిలో ఎవరికీ నష్టం ఉండదు. రాడార్ కేంద్రం ఏర్పాటు దేశరక్షణకు సంబంధించింది, దీన్ని అంగీకరిస్తేనే దేశభక్తులు అన్నట్లుగా మంత్రి మాట్లాడారు. 600 ఏండ్లనాటి దామగుండం క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది.
-మురళీధర్ దేశ్‌పాండే, దామగుండం అడవి పరిరక్షణ సమితి అధ్యక్షుడు
రాడార్ కేంద్రం ఏర్పాటు ద్వారా రేడియేషన్ ప్రభావంతో కలిగే నష్టంపై పూర్తి అవగాహన ఏర్పర్చుకొని యువత ఉద్యమించాలి. నేటి యువతరానికి అవసరమైన సమాచారం అందిస్తా. రేడియేషన్ ప్రభావంతో పలు రకాల క్యాన్సర్లు, చర్మవ్యాధులు వస్తాయని చెబుతున్నారు. తాగునీటికి ఇబ్బంది కలుగుతుంది. రేడియేషన్ దుష్ర్పభావంపై డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. తెలంగాణ దేశంలోనే అత్యంత సేఫ్ ప్లేస్, ఎలాంటి భూకంప ప్రభావిత ప్రాంతం కాదు, ఇలాంటి చోట రాడార్ కేంద్రం ఏర్పాటుతో పాటు లక్షలాది చెట్ల నరికివేతతో పూర్తిగా నాశనం అవుతుంది. ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధ్దమైతే పూర్తి అవగాహనతో ప్రశ్నలడిగి రాడార్ ఏర్పాటును అడ్డుకోవాలి.
– సత్యానందస్వామి, దామగుండం ప్రకృతి ప్రేమికుడు
ఈ ప్రాంతంలో అడవిని రక్షించుకునేందకు, జీవన విధ్వంసం జరగకుండా చూసేందుకు రాడార్ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా రాబోయే తరాలకు మేలు జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలకు ఉద్యమం కొత్తకాదు, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన చరిత్ర ఉన్నది. రూ.2500కోట్లతో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుతో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. అడవులు, మానవాళికి నష్టం జరుగుతుందని ఉద్యమం ప్రారంభం కావడంతో ఎమ్మెల్యే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతిపైనే మానవ మనుగడ ఆధారపడి ఉన్న తరుణంలో అత్యంత ప్రమాదకరమైన రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి.
– బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నార్మాక్స్ మాజీ డైరెక్టర్
రాడార్ కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే చెట్టుకు ఒకరం చొప్పున నిలబడి అడవిని కాపాడుకుంటాం. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో హైదరాబాద్ వారు సైతం పాల్గొనేలా కార్యాచరణ రూపొందించి, ప్రభుత్వం మెడలు వంచి అడ్డుకట్ట వేద్దాం. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రాడార్ కేంద్రం ఏర్పాటును అడ్డుకుందాం. దామగుండం అడవిని కాపాడుకుంటేనే స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతాం. లేదంటే ప్రజా జీవన విధ్వంసం జరుగుతుంది.
– సునంద, అడవి పరిరక్షణ ఉద్యమ నాయకురాలు
స్వచ్ఛమైన వాతావరణం గల దామగుండం పరిరక్షణకు పోరాడుతున్న వారిపై అభివృద్ధ్ది నిరోధకులుగా పాలకులు ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక ఉద్యమాలు చేసిన తాము ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేశాం. ఏ ఒక్కరి కోసమో ఈ ఉద్యమం చేయడం లేదు. ఎలాంటి కుయుక్తులు పన్నినా ప్రజా ఉద్యమాల ముందు నిలవవు. ఇప్పటికే అన్ని వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఉద్యమాన్ని ప్రత్యేక కార్యాచరణతో ముందుకు తీసుకువెళ్తాం.
– రామన్నమాదిగ, ఉద్యమ నాయకుడు
నేవీ రాడార్ సెంటర్ రద్దుకు జైలుకు వెళ్లేందుకూ సిద్ధమే. వన్యప్రాణుల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాడార్ సెంటర్ నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో 60 శాతం మందికి పిల్లలు పుట్టే అవకాశం ఉండదని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో భవిష్యత్ తరాలకు ముప్పే.
-గోవింద్‌నాయక్, ఎల్హెచ్పీఎఫ్ నాయకుడు
దామగుండం నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు ఫైల్‌ను దుమ్ము దులిపి అనుమతిచ్చామని చెప్పిన మంత్రి కొండా సురేఖ, వెనువెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు వచ్చాయంటూ దుష్ర్పచారం చేయడం తగదు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి రాడార్ కేంద్రం ఏర్పాటుపై విపరీతమైన ఆతృతగా ఉన్నారు. ఉద్యమకారులను నిర్వీర్యం చేసే విధంగా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి అన్యాయం చేస్తున్నారు, రాడార్ కేంద్రం బదులు అప్పా నుంచి వికారాబాద్ హైవే పనులు చేపట్టాలి.
– జి.నాగేందర్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నేవీ రాడార్ సెంటర్ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి ఆలోచించాలి. రాడార్ సెంటర్‌తో ఎదురయ్యే దుష్పరిణాలను గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలి. చాలా గ్రామాల్లోని ప్రజలకు ఈ విషయం తెలియదు. మానవ మనుగడకే ముప్పు వాటి ల్లుతుందని తెలియజేయడం ద్వారా ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది.
-సాయన్న, రిటైర్ట్ ఉపాధ్యాయుడు