మొయినాబాద్, డిసెంబర్ 14 : అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కామన్ డైట్ మెనూను మొయినాబాద్ మండలం.. చిలుకూరు గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల/కళాశాలలో శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సీఎం ప్రారంభించారు.
గురుకుల పాఠశాలలో చదివి మద్రాస్‌లో ఐఐటీ సీట్ సంపాదించిన వై.సాయిరాం, ఉస్మానియా మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన శృతి, హేమంత్‌లకు ముఖ్యమంత్రి ల్యాప్‌టాప్‌లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని గురుకుల పాఠశాలలను ఒకే సముదాయంలోకి తీసుకొచ్చేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల సముదాయాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకే ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నట్లు చెప్పారు. విద్యా సంస్థలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు సంబంధించిన నిధులను ప్రతి నెలా 10వ తేదీలోపు గ్రీన్ చానల్ ద్వారా విడుదల చేయాలని ఈ మధ్యనే ఆర్థిక శాఖ మంత్రిని, అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
డైట్ చార్జీలు 40 శాతం, కాస్మెటిక్ చార్జీలు 200 శాతం పెంచామన్నారు. నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం రాష్ట్రంలోని 75 ఐటీఐలను టాటా సంస్థతో కలిసి అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్యాలను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రతి హాస్టల్లోనూ మెస్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని, బాధ్యతాయుతంగా పని చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతిచెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా మారాయని, రోడ్ల అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.300 కోట్లు, ఆర్అండ్బీ రోడ్లకు రూ.200 కోట్లు ఇవ్వాలని కోరారు.
కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ శోభారాణి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి అలుగుల వర్షిణి, కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ గౌతంకుమార్, ఎంఈవో వెంకటయ్య, గురుకుల విద్యా సంస్థ ఓఎస్డీ శర్మ, పాఠశాల ప్రిన్సిపాల్ దేవేందర్, రాష్ట్ర నాయకుడు షాబాద్ దర్శన్, మాజీ సర్పంచ్‌లు స్వరూప, ప్రవీణ్‌కుమార్, నాయకులు మహేందర్‌ముదిరాజ్, రాంరెడ్డి, రాజుగౌడ్, గడ్డం వెంకట్‌రెడ్డి, ఈగ రవీందర్‌రెడ్డి, నిర్దుల విఘ్నేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.