రంగారెడ్డి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : సహకార సంఘాల బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. కేంద్ర సహకార సంఘం పని తీరుపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సబితారెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జనరల్ మేనేజర్ శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.73.68 కోట్లతో మూడు దశల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు.
తాజాగా రైతుల అవసరాల కోసం జిల్లాలో 20 ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో 30 గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు రూ.34.64 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో రూ.39 కోట్లతో రెండు దశల్లో గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, రైస్ మిల్లులను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. నూతనంగా నిర్మించనున్న 30 గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, రైస్ మిల్లుల పనులను సత్వరమే ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
త్వరలో గిడ్డంగుల నిర్మాణం
ఉప్పరిగూడ సహకార సంఘం పరిధిలో కల్స ఇబ్రహీంపట్నం, ఉప్పరిగూడ, శామీర్‌పేట సహకార సంఘం పరిధిలో లక్ష్మాపూర్, తుర్కయాంజాల్ పరిధిలో కోహెడ, దూలపల్లి పరిధిలో దొమ్మెర పోచంపల్లి, మేడ్చల్ సహకార సంఘం పరిధిలో మేడ్చల్, కందుకూరు సహకార సంఘం పరిధిలో మేడ్చల్, కందుకూరు సహకార సంఘం పరిధిలో కందుకూరు, బౌరంపేట సహకార సంఘం పరిధిలో బౌరంపేట, పూడూరు పరిధిలో పెద్ద ఉమ్మెంతల, ధారూరు పరిధిలో ధారూరు, నవాంద్గీ పరిధిలో బషీరాబాద్, శివారెడ్డిపేట్ పరిధిలో పులిసి మామిడి, శంషాబాద్ సహకార సంఘం పరిధిలో వట్టి మేనపల్లి, షాబాద్ సహకార సంఘం పరిధిలో షాబాద్, మోమిన్‌పేట్ సహకార సంఘం పరిధిలో మోమిన్‌పేట్, యాచారం పరిధిలో యాచారం, యాలాల పరిధిలో దౌల్తాపూర్, ఎల్మకన్నె పరిధిలో అల్లాపూర్, ఆర్కే మైలారం పరిధిలో దండు మైలారం గ్రామాల్లో గిడ్డంగులను నిర్మించబోతున్నామని తెలిపారు. మరో వారం రోజుల్లో రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా సహకార బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ కల్పించినందుకు డీసీసీబీ డీసీఎంస్ చైర్మన్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గౌరవ వేతనాలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు.