రంగారెడ్డి, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) :ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే పేదలకు భారమే.. కట్నాలు, కానుకలు, ఖర్చులంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి. పేదల కష్టాలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ పేదింటికి పెద్దన్నలా, ఆడబిడ్డలకు మేనమామలా ఆదుకోవాలని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఆడబిడ్డ పెండ్లికి ఒక్కో కుటుంబానికి రూ.1,00,116 సాయం అందిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 5915 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద లబ్ధి చేకూరింది. దీంతో పేదింట్లో కల్యాణ కాంతులు విరజిమ్ముతున్నాయి. అంతేకాకుండా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకూ తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఈ ఏడాది 42 జంటలు దరఖాస్తు చేసుకోగా, 17 జంటలకు నిధులు మంజూరయ్యాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలు, బలహీన వర్గాల వారి కోసం పాటుపడుతూ మానవీయతను చాటుకుంటున్నది. ఎన్నో కుటుంబాలు ఇబ్బందులపాలు కాకుండా ప్రభుత్వం సాయమందిస్తూ చేయూతనిస్తున్నది. కుల, మత వర్గ వైషమ్యాలనే తేడా లేకుండా పేదలు, మధ్య తరగతి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పలు పథకాల ద్వారా నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. పేదరికంలో మగ్గుతున్న అనేక కుటుంబాలు ఆడపిల్లల పెండ్లిళ్లు చేసేందుకు ఆస్తులు అమ్ముకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి గాథలు నిరుపేదలైన ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఇటువంటి గాథలను దగ్గరగా చూసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 అక్టోబర్ 2న రూ.51,000లతో ఎస్సీ, ఎస్టీలకు కల్యాణలక్ష్మి, మైనార్టీలకు షాదీముబారక్ పథకాలను ప్రారంభించారు. 2016 నుంచి బీసీలకు కూడా కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత 2017 ఏప్రిల్ నుంచి రూ.75,116 అందించారు. 2018 మార్చి నుంచి 1,00,116లకు పెంచి అమలు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత (2022-23) సంవత్సరానికి 5,915 మందికి కల్యాణలక్ష్మి/షాదీముబారక్ సాయమందించారు.
కొనసాగుతున్న చెక్కుల పంపిణీ
మైనార్టీల్లో ఈ సంవత్సరానికి 1712 మంది దరఖాస్తు చేసుకోగా 1176 మందికి మంజూరైంది. ఇందుకు రూ.1177.12 లక్షలు విడుదలైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బీసీలు, ఈబీసీలకు 2016-17 నుంచి కల్యాణలక్ష్మి పథకం ప్రారంభమైంది. బీసీ(వెనుకబడిన తరగతులు)లకు 2673 మందికి కల్యాణలక్ష్మి మంజూరు కాగా.. రూ.26,76,10,068 విడుదలయ్యాయి. ఎస్సీ విభాగంలో 1001 మందికి, ఎస్టీ విభాగంలో 1033 మందికి మంజూరు కాగా, పంపిణీ కొనసాగుతున్నది. గతం (2021-22)లో ఎస్టీల విభాగంలో 1042 మంది దరఖాస్తు చేసుకోగా, 991 మందికి నిధులు మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
కులాంతర వివాహాలకు కూడా ప్రోత్సాహకాలు
తెలంగాణ సిద్ధించాక, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుంటున్నది. నిరుపేదలు, అణగారిన వర్గాలను మాత్రమే కాకుండా, కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు కూడా ప్రభుత్వం చేయూతను ఇస్తున్నది. బీసీల్లో కులాంతర వివాహాలు చేసుకుంటే, రూ.10వేల చొప్పున సాయం అందిస్తున్నది. 2021 – 22లో నలుగురికి ఆర్థిక సాయం అందించినది. 2022-23లో ముగ్గురు దరఖాస్తు చేసుకోగా కార్యాచరణ కొనసాగుతున్నది. ఎస్సీలలో కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు 2019 నుంచి రూ.2,50,000లను ఆర్థిక సాయంగా అందిస్తున్నది. ఇప్పటి వరకు 66 జంటలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందారు. 2022-23వ సంవత్సరానికి 42 జంటలు దరఖాస్తు చేసుకోగా, 17 జంటలకు ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి. కాగా, ఇందుకు సంబంధించి కార్యాచరణ కొనసాగుతున్నది.
పెండ్లి సాయం అందడంతో చానా సంతోషంగా ఉన్నం 
పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందించడంతో మా కుటుంబంలో చానా సంతోషమేసింది. కొన్ని రోజుల కింద మా బిడ్డ పెండ్లి చేసినం. కల్యాణలక్ష్మి పథకం ద్వారా మాకు లక్షా నూట పదహారు రూపాయల సాయం చేసిండ్రు. ఓ మేనమామగా ముఖ్యమంత్రి ఆదుకోవడం మంచి నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
– పుల్లమ్మ, రేగడి ఘనాపూర్, చేవెళ్ల మండలం
పేదలకు చేయూతనిచ్చే పథకం 
పేదలను ఇక్కట్ల నుంచి ఆదుకునే పథకమిది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. అన్ని వర్గాల వారికి సంబంధించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో మూడు రోజులుగా కొనసాగిస్తున్నాం. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రోజుకు 100 నుంచి 150 వరకు పంపిణీ చేస్తున్నాం. ఈ వారంలో మంజూరైన లబ్ధిదారులందరికీ చెక్కులను అందజేస్తాం.
–చంద్రకళ, రెవెన్యూ డివిజనల్ అధికారి, రాజేంద్రనగర్