జిల్లాలో సీఎం కేసీఆర్ సభలతో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో మరింత జోష్ కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలకు జనం ఉవ్వెత్తున తరలివస్తుండడంతో గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. ఇప్పటికే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ సభలు జరగగా, ఈ నెల 27 చేవెళ్ల, షాద్‌నగర్‌లలో జరుగనున్నాయి.
సీఎం కేసీఆర్ ప్రసంగంలోని యాస, అభివృద్ధి లెక్కలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సమైక్య పాలన పరిస్థితులు, స్వరాష్ట్రంలో జరిగిన సమగ్రాభివృద్ధి, సంక్షేమం, కాంగ్రెస్ వస్తే జరిగే నష్టాన్ని కండ్లకు కట్టినట్లు వివరించడం ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలో గులాబీ పార్టీకి ఎదురేలేదన్న చర్చ జోరుగా సాగుతున్నది.
-రంగారెడ్డి, నవంబర్ 24, (నమస్తే తెలంగాణ)ర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉరకలెత్తుతున్న ఉత్సాహం
రంగారెడ్డి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ సభలు జిల్లాలో గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలకు జనం ఉవ్వెత్తున తరలివస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ సభలు జరుగగా పల్లెలు, పట్టణాలు, మారుమూల తండాల నుంచి జనం పెద్దఎత్తున సభలకు తరలివచ్చి విజయవంతం చేశారు. సీఎం కేసీఆర్ ప్రసంగంలోని యాస, అభివృద్ధి లెక్కలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. సమైక్య పాలన పరిస్థితులు, స్వరాష్ట్రంలో జరిగిన సమగ్ర అభివృద్ధి, సంక్షేమ వివరాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.
సభల సందర్భంగా నేతలు సైతం సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. సీఎం సభలతో రంగారెడ్డి జిల్లాలో గులాబీ జెండాకు ఎదురేలేదన్న చర్చ జోరుగా సాగుతుండగా.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం ఉరకలెత్తుతున్నది. ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలంతా సీఎం ఆశీర్వాద సభల విజయవంతానికి ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నారు. జన సమీకరణలోనూ కలిసికట్టుగా వ్యవహరిస్తుండడంతో ప్రజలు లక్షలాదిగా తరలివస్తున్నారు. సీఎం కేసీఆర్ తన యాసతో ప్రసంగాల్లో కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడుతున్న తీరు సైతం ప్రజలను ఆకట్టుకుంటున్నది. కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ఊర్లకు ఊర్లే తరలివస్తున్నాయి.
24 గంటల కరెంటు కావాలా? 3 గంటల కరెంటు కావాలా? అంటూ కేసీఆర్.. ప్రతి సభలోనూ జనాలను అడుగుతున్నారు. కాంగ్రెస్ నేతలు దుబారా అంటున్న రైతు బంధు ఉండాలా? వద్దా? అని కేసీఆర్ ప్రశ్నిస్తుండగా.. ప్రతి సభలోనూ ప్రతి ఒక్కరూ చేతులెత్తి కేసీఆర్‌కు సంఘీభావం తెలుపుతున్నారు. తొమ్మిదన్నరేండ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా వివరించడంతోపాటు, అభివృద్ధితో ఆగొద్దంటే.. మ్యానిఫెస్టోలోని హామీలు ప్రజలకు అందాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మాట తప్పడు, మడమ తిప్పడు అనే అచంచల విశ్వాసమే సీఎం కేసీఆర్ స్పీచ్ పట్ల ప్రజలు ఆసక్తి చూపడానికి కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
జిల్లాలో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, జైపాల్యాదవ్లకు మద్దతుగా సీఎం కేసీఆర్ సభలు జరిగాయి. ఈ సభలకు చిన్నా, పెద్దా, ముసలి ముతక, ఆడ మగ తేడా లేకుండా సభలకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. జనం పోటెత్తడంతో అన్ని చోట్లా సభలు జన జాతరను తలపించాయి. పార్టీ శ్రేణులతోపాటు అభిమానులు, వివిధ పథకాల లబ్దిదారులు, సామాన్య ప్రజానీకం అశేషంగా వచ్చి సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఈ నెల 27న చేవెళ్ల, షాద్‌నగర్‌లలో ఎమ్మెల్యేలు యాదయ్య, అంజయ్యయాదవ్ల తరఫున నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
ఈ సభలకు సైతం వేలాదిగా తరలివచ్చేందుకు జనం సన్నద్ధులు అవుతుండడం విశేషం. సీఎం కేసీఆర్ సభలకు వస్తున్న స్పందనను చూస్తుంటే రంగారెడ్డి జిల్లాలో అన్ని స్థానాల్లో గులాబీ జెండాకు ఎదురుండదన్న చర్చ జోరుగా సాగుతున్నది. పిడికెడు మందితో తెలంగాణ ఉద్యమం ప్రారంభం నాటి నుంచే అశేష జనం కేసీఆర్‌పై విశ్వాసంతో వెంట నడిచిందని, ఇప్పటి వరకు కూడా అదే విశ్వాసంతో వెంట నడుస్తున్నదని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు.